Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రంలో సాగు పెంచేందుకు ఆయిల్ ఫెడ్ కృషి
- రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ రామకృష్ణారెడ్డి
నవతెలంగాణ-మోత్కూరు
రైతులు డిమాండ్ ఉన్న ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, ఆయిల్ ఫాం సాగుతో మంచి లాభాలు పొందవచ్చని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు.మోత్కూరు మండలం అనాజిపురంలో జెడ్పీటీసీ గోరుపల్లి శారదసంతోష్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో సాగు చేస్తున్న ఆయిల్ ఫాం సాగును ఆదివారం ఆయన పరిశీలించి మాట్లాడారు.తెలంగాణ రైతాంగానికి ఆయిల్ ఫాం సాగు కొత్త అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఈ సాగు కొంత ఎక్కువగా ఉందన్నారు. తక్కువ పెట్టుబడి, చీడపీడలు లేని పంట, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్ ఫాం సాగును పెంచేందుకు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులను ఆయిల్ ఫాం సాగు వైపు మళ్లించేందుకు ఇప్పటికే అవగాహనా నదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారులను, ఫీల్డ్ ఆఫీసర్లను రైతులకు అందుబాటులో ఉంచి ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు.యాదాద్రి జిల్లాలో 6 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం సాగు చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని, అందులో భాగంగా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ ఆధ్వర్యంలో మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో 25 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటు చేసి 4.50 లక్షల మొక్కలు పెంచుతున్నట్టు తెలిపారు. ఆయిల్ ఫాం సాగును ప్రోత్సహించడానికి రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి గాను జిల్లాలో సంస్థ ఆధ్వర్యంలో ఆరుగురు ఫీల్డ్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. ఎకరం వరి సాగు చేసే నీటితో నాలుగు ఎకరాల ఆయిల్ ఫాం సాగు చేయవచ్చని, సాగుపై ఆసక్తి చూపే రైతులు ఫీల్డ్ ఆఫీసర్ల వద్ద భూముల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.సాగుకు ముందుకొచ్చే రైతులకు జనవరిలోగా మొక్కలు పంపిణీ చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మొక్కలకు, డ్రిప్ కు రైతులకు సబ్సిడీ కూడా అందుతుందని తెలిపారు. ఆయిల్ ఫాం మొక్కలు ఒక్కసారి నాటితో 40 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని, తక్కువ పెట్టుబడితో ఆయిల్ ఫాం సాగు చేయవచ్చని, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంట కావడంతో రైతులు ఆయిల్ ఫాం సాగుపై దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గోరుపల్లి సంతోష్ రెడ్డి, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, మాజీ ఎంపీటీసీ పానుగుళ్ల విష్ణుమూర్తి, రైతులు గోరుపల్లి సతీష్ రెడ్డి, వల్లందాసు వెంకటయ్య, చేగూరి వెంకన్న, బర్రె శంకరయ్య, గోరుపల్లి శ్రీనివాస్ రెడ్డి, దేవర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.