Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామ పంచాయతీలకు నిలిచిన నిధులు
- విడుదలకాని కేంద్రం కోటా, జమకాని రాష్ట్ర నిధులు
- ఇబ్బందుల్లో సర్పంచులు
గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత ఏర్పడింది. ఎనిమిది నెలలుగా కేంద్ర ప్రభుత్వ నిధులు రాక.. మూడు నెలలుగా రాష్ట్రప్రభుత్వ నిధులు జమకాక.. అభివృద్ధి కుంటుపడుతోంది. పల్లె ప్రగతి, రోజువారీ పారిశుధ్య పనులు చేపట్టేందుకు పంచాయతీల ఖాతాల్లో నిధులు లేకపోవడంతో సర్పంచులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. గ్రామ పంచాయతీలకు ఆస్తి పన్ను, ఇతర రూపాల్లో సొంతంగా సమకూరిన ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వీలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. నిధుల విషయంలో స్పష్టత లేక పాలన గాడితప్పతోంది.
నవతెలంగాణ- నల్లగొండ
పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను ఎనిమిది నెలలుగా నిలిపివేసింది. చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులను కూడా ఆలస్యంగా జమ చేస్తోంది. జిల్లాలో 844 గ్రామ పంచాయతీలకు 16,31,399 జనాభా ఉన్నారు. పంచాయతీలో జనాభాను బట్టి ఒక్కొక్కరికీ రూ.166 చొప్పున కేంద్రం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం రూ.115 మాత్రమే అందిస్తోంది. అయితే కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా ప్రచారం చేసుకుంటుందని.. రాష్ట్రంతో సంబంధం లేకుండా నేరుగా పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేకంగా ఖాతాలు తెరవాలని సూచించింది. సర్పంచులు ప్రత్యేక బ్యాంకు ఖాతాలను సైతం తెరిచారు. కానీ నిధులను మాత్రం జమ చేయడం లేదు. రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల వాటా కూడా మూడు నెలలుగా జమ కావడం లేదు. దీంతో గ్రామాల్లో పనులు ఎలా చేపట్టాలో తెలియక సర్పంచులు సతమతమవుతున్నారు. పంచాయతీల్లో చేసిన పనులకు సంబంధించిన చెక్కులను ట్రెజరీలకు పంపించి నెలలు గుడుస్తున్నా ఖాతాల్లో మాత్రం నగదు జమ చేస్తలేరని సర్పంచులు ఆందోళన చెందుతున్నారు.
దిక్కుతోచని స్థితిలో సర్పంచులు...
ఎస్ఎఫసీ నిధులతో గ్రామాల్లో పారిశుధ్య, పైపులైన్ లీకేజీ, సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు చేయాల్సి ఉంది. నిధుల లేమితో ఆ పనులకూ బ్రేక్ పడింది. తప్పని పరిస్థితుల్లో కొంత మంది సర్పంచులు అప్పులు చేసి పనులు చేయించారు. వాటికి సంబంధించిన బిల్లులు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలవారీగా వసూలు చేసే పన్నులు విద్యుత్, తాగునీటి బిల్లులకు కూడా సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. రావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాక సర్పంచులు దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు.
పంచాయతీలపై ఆర్థిక భారం..
జిల్లాలో గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు నెలనెలా విడుదల కాకపోవడంతో విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపు, కార్మికుల వేతనాల చెల్లింపులు భారంగా మారాయి. కొన్ని గ్రామ పంచాయతీలకు పన్నుల రూపంలో వచ్చిన సాధారణ నిధులను సైతం వినియోగించి విద్యుత్ బిల్లుల చెల్లింపులు జరపాలని పంచాయతీ అధికారులు కార్యదర్శులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
నిధులు రావడం లేదు...
కడారి కృష్ణయ్య. కనగల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు
ఎనిమిది నెలలుగా కేంద్రప్రభుత్వ నిధులు, మూడు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కావడం లేదు. గ్రామంలో అభివృద్ధి, పారిశుధ్య పనులు ముందుకుసాగడం లేదు. అన్ని రకాల పనులు నిలిచిపోయి పాలన కుంటుపడుతోంది. కార్మికులకు వేతనాలు ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రభుత్వాలు నిధులు సకాలంలో విడుదల చేస్తే గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తాయి.
త్వరలోనే మంజూరవుతాయి
విష్ణువర్ధన్ రెడ్డి డీపీఓ నల్లగొండ
గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే నిధులను విడుదల చేయనున్నాయి. నిధుల మంజూరు ఆలస్యం జరిగినప్పటికీ విడుదల కాగానే అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి. ఇప్పటికే కేంద్రానికి కొత్త ఖాతాల వివరాలను అందజేశాం. ప్రభుత్వాలు త్వరలోనే ఖాతాల్లో నిధులు జమ చేస్తాయి. అభివృద్ధి విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.