Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
సంఘటిత, అసంఘటిత రంగాలలో ఎగుమతి దిగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ సౌకర్యం కల్పిస్తూ హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని టీిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో హమాలీ ఫెడరేషన్ మూడవ జిల్లా మహాసభ నిర్వహించారు. మహాసభ ప్రారంభానికి ముందు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి సీఐటీయూ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఎఫ్సిఐ, సివిల్ సప్లై, రైస్ మిల్ ,మార్కెట్ యార్డ్ బేవరేజెస్, ఎలక్ట్రిసిటీ స్టోర్ ,ఎస్డబ్ల్యూసి ,సిడబ్ల్యూసి ,ప్రయివేటు గోదాములు, కూరగాయల మార్కెట్లు, సిమెంట్ ఫర్టిలైజర్ ఎగుమతి పనులు నిర్వహిస్తున్న హమాలీలు, క్యాజువల్ కార్మికులు, స్వీపర్లు, రైస్ మిల్ డ్రైవర్లు , దినకూలీలు,తదితర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న హమాలీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని 50 ఏండ్లు నుండి వారికి నెలకు రూ.6000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేకుండా కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయని ప్రభుత్వాలు పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈనెల 24న మిర్యాలగూడ పట్టణంలో 33 జిల్లాల నుండి 500 మంది ప్రతినిధులతో రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం కార్మికులు సాధించుకొని కార్మిక చట్టాలను మార్పులు చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు.కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోళ్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించాలని కోరారు.అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా తుమ్మల వీరారెడ్డి, అధ్యక్షులుగా తిరుపతి రామ్మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా సాగర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా దండెంపల్లి సత్తయ్య, కోశాధికారిగా చల్లా యాదయ్య, మరో 35 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నన్నూరి వెంకటరమణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మన్నెం బిక్షం, సీతారామరెడ్డి, తిప్పర్తి మండల కన్వీనర్ బీమగాని గణేష్, కానుగు లింగస్వామి, మల్లు గౌతమ్ రెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్ భీమగాని గణేష్, మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నాగరాజు , తదితరులు పాల్గొన్నారు.