Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి నంద్యాల నరసింహారెడ్డి కంచర్ల భూపాల్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండవ మహాసభల సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఏర్పాటుచేసిన తెలంగాణ రాష్ట్ర నాలుగో వీధి నాటకోత్సవాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ నాటకోత్సవాలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నంద్యాల నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై డప్పు వైద్యాలతో నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ నాటకో ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజా నాట్యమండలి సభ్యులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నాటకోత్సవంలో కళారూపాల సమన్వయకర్త, పిఎన్ఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించిన అల్లా బోల్, డెమోక్రసీ, రైతు బ్రతుకు ఒగ్గు కథ, చిరుతల కథ, గోసంగి, వీర తెలంగాణ నాటకాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. డప్పు వాయిద్య కారులు వేసిన స్టెప్పులకు ప్రజలు చప్పట్ల ద్వారా స్వాగతం పలికారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కళాకారులు పాడిన పాటలకు ప్రజలు చప్పట్ల శబ్దాలతో ప్రాంగణం మారి మోగింది. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆనంద్ పరిశోధకురాలు అనిత, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు సాంబరాజు యాదగిరి, అవ్వరు గోవర్ధన్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొండూరు భాస్కర్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున, ఆవాజ్ రాష్ట్ర నాయకులు సయ్యద్ హాషం, తదితరులు పాల్గొన్నారు.