Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు వృద్ధుల పేరున 29 నెలల డబ్బులు డ్రా
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
- పోస్టల్ జిల్లా అధికారులకు పోస్ట్ ద్వారా ఫిర్యాదు పంపిన ఆ గ్రామ యువకుడు
నవతెలంగాణ-గుండాల
చనిపోయిన ముగ్గురు వృద్ధుల పింఛన్ సొమ్మును డ్రా చేస్తున్న సంఘటన మండలంలోని అనంతారం గ్రామంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వృద్ధుల పేరున మొత్తం 29 నెలల పింఛన్లు డ్రా చేస్తుండటంతో విషయం తెలిసిన ఆ గ్రామ యువకుడు ఈనెల 21న జిల్లా పోస్టల్ అధికారి,సబ్ పోస్టల్ అధికారులు మోత్కూరు,ఆలేరు అధికారులకు పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి...అనంతారం గ్రామానికి చెందిన కుమ్మరికుంట్ల లక్ష్మి 2020 నవంబర్ 19న,ఇంద్రియాల యాదయ్య 2021 ఆగస్టు 18న,నాగుల సొక్కమ్మ 2022 జూన్ 2న మృతి చెందారు.మృతులు ముగ్గురు ఆసరా పథకం లబ్దిదారులు కాగా రూ.2016 పింఛన్ తీసుకుంటున్నారు. లక్ష్మీ, యాదయ్య, సొక్కమ్మ చనిపోయినా పింఛన్లు డ్రా చేస్తున్నారన్న అనుమానం వచ్చిన ఆ గ్రామ యువకుడు కొమిరె రవి కూపీ లాగడంతో ఆ ముగ్గురి పేరున పింఛన్లు డ్రా అవుతున్నాయి. కుమ్మరికుంట్ల లక్ష్మి (పింఛన్ ఐడీ NGGUR44087) పేరున 2022 జూలై వరకు 19 నెలలు,ఇంద్రియాల యాదయ్య (NGG UR 00616), 2022 మార్చి వరకు 7 నెలలు,నాగుల సొక్కమ్మ (NGGUR 00785) 2022 సెప్టెంబర్ వరకు 3 నెలలు మొత్తం ముగ్గురి పేరున మొత్తంగా 29 నెలల పింఛన్లు డ్రా చేస్తున్నారు. పింఛన్లను గ్రామానికి చెందిన బీపీఎం బొట్ల లక్ష్మీనర్సయ్య పంపిణీ చేస్తున్నారు. చనిపోయిన వారి పేరున పింఛన్లు డ్రా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
విచారిస్తాం :గార్లపాటి శ్రీనివాసులు, ఎంపీడీఓ,గుండాల
ఈ విషయమై ఎంపీడీవో జి శ్రీనివాసులు ను వివరణ కోరగా మృతి చెందిన వారి పేరున పింఛన్లు డ్రా చేస్తున్న విషయం ఈరోజే నాదృష్టికి వచ్చింది.విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.