Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్షసాధింపు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్
నవతెలంగాణ-చౌటుప్పల్
దేశం మొత్తంలో బీజేపీ ప్రభుత్వమే ఉండేలా మోడీ కుట్రలు చేస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్నాడని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్‌డి.జహంగీర్ విమర్శించారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో సీపీఐ(ఎం) మున్సిపల్ కమిటీ వర్క్ షాప్ సమావేశం దండ అరుణ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జహంగీర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలపై కక్ష సాధింపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడి దాడులు చేయిస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి అప్రజాస్వామిక పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రంలోని మోడి ప్రభుత్వం కుట్రలు పన్నుతుందన్నారు. మోడి, అమిత్ షా ఇద్దరూ డబుల్ ఇంజన్ పాలన పేరుతో మతపరమైన విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. జాతీయ సంపదను మోడి ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ ఐక్యతకు బీజేపీ ప్రమాదకరంగా మారిందన్నారు. తెలంగాణలో గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుందన్నారు. మోడి ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తుందని విమర్శించారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడి హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో గవర్నర్ జోక్యం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రాల విభజన హామీలను అమలుచేయడంలో విఫలం చెందిందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో బీజేపీ డొల్లతనం బయటపడిందన్నారు. బీజేపీ విధానాలు రాజకీయాల్లో అలజడులు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎమ్‌డి.పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నర్సింహా, మున్సిపల్ వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, సీపీఐ(ఎం) మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు గోశిక కరుణాకర్, బత్తుల దాసు, ఆకుల ధర్మయ్య, బత్తుల విప్లవ్, ఉష్కాగుల శ్రీను, ఎమ్‌డి.ఖయ్యుమ్, ఎర్ర ఊషయ్య, చీకూరి ఈదయ్య, పర్నె ధర్మారెడ్డి, బొడ్డు అంజిరెడ్డి, భావండ్లపల్లి స్వామి, గుణమోని అయిలయ్య, సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి, గుర్రం నర్సింహా, గంజి రామచంద్రం, అవ్వారి రామేశ్వరి, మల్లేశం, ఎమ్‌డి.అర్షియా, ఎమ్‌డి.రేష్మ పాల్గొన్నారు.