Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
స్త్రీలు, బాలికల పట్ల జరుగుతున్న హింస, వేధింపుల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కలసికట్టుగా ముందుకు వచ్చి తమ వంతు కృషి అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం నాడు అంతర్జాతీయ స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినము పురస్కరించుకొని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చర్చా వేదిక నిర్వహించారు. బాలల పరిరక్షణ కమిటీ చైర్మెన్ జయశ్రీ, సఖి సెంటర్ కోఆర్డినేటర్ ప్రమీల, బాల రక్ష కోఆర్డినేటర్ చందనేశ్వరి, జిల్లా మహిళా అధికారులు, జిల్లా అధికారులు చర్చా వేదికలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్త్రీలు, బాలికల పట్ల శారీరక, మానసికంగా ఏ రూపంలో దాడి జరిగినా అది వారి పట్ల హింసేనని, జిల్లా స్థాయి లోకల్ కమిటీ ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సఖి కేంద్రం ద్వారా బాధిత మహిళలకు సత్వర సహాయం అందించడం జరుగుతుందని, మహిళా హెల్ప్ లైన్ 181 నెంబర్ ద్వారా సేవలందిస్తున్నట్టు తెలిపారు. జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ముందు మన ఆలోచనా విధానం మారాలని, బయట జరిగేది మాత్రమే కాకుండా మన ఇంటిలో కూడా గమనించాలని, మహిళల పట్ల గౌరవం పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం. ఉపేందర్ రెడ్డి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, జిల్లా ఉద్యాన అధికారి అన్నపూర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, సిడిపిఓలు స్వరాజ్యం, చంద్రకళ, శైలజ, జ్యోత్స్న, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.