Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 27 నుంచి 29 వరకు నల్లగొండ పట్టణంలో జరుగనున్న తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.శుక్రవారం స్థానిక ఎంవీఎన్ భవన్లో సంఘం జిల్లా అధ్యక్షులు బుర్రి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు.దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల మూలంగా వ్యవసాయరంగం దెబ్బతిని పోతుందన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వ్యవసాయరంగంలో స్వామినాథన్ కమిషన్ చూపించిన సిఫార్సులను అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు.దేశ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడం కోసం తెచ్చిన నల్లచట్టాలను వెనక్కు కొట్టడంలో రైతాంగం చేసిన పోరాటం మరువలేనిదన్నారు.దేశ వ్యవసాయరంగాన్ని కాపాడుకోవడం కోసం పంటలకు గిట్టుబాటుధర కల్పించడం కోసం రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు సబ్సిడీ అందించడం కోసం పోరాటాలు ఉధృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.ఈ నేపథ్యంలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాల రూపొందించడం కోసం ఈ నెల 27, 28,29వ తేదీలలో నల్లగొండ జిల్లాకేంద్రంలో జరిగే రాష్ట్ర మహాసభలలో చర్చించడంతో పాటు పోరాట రూపకల్పన చేస్తామన్నారు.మహాసభల ప్రారంభ సూచకంగా 27వ తేదీన ఎన్జీ కళాశాల మైదానంలో జరుగు బహిరంగసభకు జిల్లాలోని రైతాంగం తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దండా వెంకట్రెడ్డి, జిల్లా ఆఫీస్ బేరర్స్ కొప్పుల రజిత, కందాల శంకర్రెడ్డి,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,పల్లె వెంకట్రెడ్డి,దుగ్గి బ్రహ్మం, దేవరం వెంకటరెడ్డి,ఉప్పలయ్య, స్టాలిన్రెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.