Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలను కష్టాల్లోకి నెట్టి కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-మోత్కూర్
వ్యవసాయ కూలీలకు పని భద్రత కల్పించేందుకు తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం క్రమంగా ఎత్తేసేలా కుట్ర చేస్తోందని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. మున్సిపల్ కేంద్రంలోని కామ్రేడ్ వేముల మహేందర్, కామ్రేడ్ రొడ్డ అంజయ్య నగర్ లోని సుమంగళి ఫంక్షన్ హాల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభల్లో ఆదివారం నిర్వహించిన ప్రతినిధుల మహాసభకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రతినిధులు హాజరు కాగా మహాసభకు రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, జిల్లా సహాయ కార్యదర్శులు గంగాదేవి సైదులు, మామిడి స్వరూప అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ముందుగా వ్యవసాయ కార్మిక సంఘం జెండాను రాచకొండ రాములమ్మ ఆవిష్కరించారు. అమరవీరులైన కామ్రేడ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రాతినిధులనుద్దేశించి సీతారాములు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో క్రమంగా నిధులు తగ్గిస్తూ ఎత్తివేసే కుట్రచేస్తుందని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు కూలీలకు ఉపాధి హామీ చట్టంలో పనులు కల్పించికుటుంబాలకు భద్రత కలిగిందన్నారు. ఆ చట్టం ద్వారా కూలి కుటుంబాలకు ఉపాధి దొరికిందని కూలీల పొట్ట కొట్టేలా అలాంటి చట్టాన్ని బీజేపీప్రభుత్వం రద్దు చేసేలా వ్యవహరిస్తోందన్నారు. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర ధరలను కేంద్ర ప్రభుత్వం రోజు రోజుకు పెంచుతూ ప్రజలను కష్టాల్లోకి నెట్టేస్తుందని, కార్పొరేట్లకు దేశ సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం కూలీలను కార్మికులను గాలికొదిలేసిందని, ఒక్కపూట తిండి కోసం కూలీలు ఎన్నో ఇబ్బందులు పడగా, ఆదానీ, అంబానీల సంపద మాత్రం లక్షల కోట్లకు పెరిగిందన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.నాగయ్య మాట్లాడుతూ ఉపాధి హామీలో ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని, రోజు వేతనం రూ. 600 ఇవ్వాలని, పట్టణ ప్రజలకు ఉపాధి హామీ చట్టాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కూలీల వాటాను 90 శాతానికి పెంచి మెటీరియల్ కాంఫోనెంట్ 10 శాతం తగ్గించాలని, ఉపాధి హామీలో యంత్రాలను, కాంట్రాక్టర్లను నిషేధించాలని, అడిగిన అందరికీ పని కల్పించి వారం వారం వేతనాలు చెల్లించాలని, మెడికల్ కిట్టు, పే స్లీప్ లు, పనిముట్లు ,టెంట్లు మంజూరు చేయాలని, మహిళలకు, వికలాంగులకు చేయగలిగిన పనులు అప్పగించాలని, పని ప్రదేశంలో చనిపోయిన కూలీలకు రూ.పది లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, మేట్లుకు సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు మోత్కూర్ లో జరిగిన జిల్లా ద్వితీయ మహాసభలు విజయవంతంగా ముగిశాయి. మహాసభలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ, ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి. జహంగీర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కల్లూరి మల్లేశం, వ్యకాస జిల్లా ఉపాద్యక్షుడు జెల్లెల్ల పెంటయ్య, జిల్లా సహాయ కార్యదర్శి జూకంటి పౌల్, ఉపాధ్యక్షుడు పల్లెర్ల అంజయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కూరపాటి రాములు, సల్లూరి కుమార్, సిర్పంగి స్వామి, గుంటోజి శ్రీనివాసచారి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య, వేముల సైదులు, కొండాపురం యాదగిరి, వల్లంపట్ల శ్రీనివాసరావు, దొడ్డి బిక్షపతి, ఎర్ర ఊషయ్య పాల్గొన్నారు.