Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ ఉత్పత్తులపై చట్టం చేయాలి
- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని
నవతెలంగాణ-నల్లగొండ
మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా ఆదివారం పట్టణంలోని 47వ వార్డు అన్సారి కాలనీలో పట్టణ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. దీనిపై పార్లమెంటులో ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. స్వామి నాథన్ సిఫారసులు అమలుకు నోచుకోలేదని తెలిపారు. రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేసే విధంగా మోదీ ప్రభుత్వ విధానాలపై ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకోవాలని చెప్పారు. కార్మిక లేబర్ చట్టాలను కూడా మోదీ రద్దు చేయాలన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని పేర్కొన్నారు. పండిన పంటలు అమ్ముకున్న తర్వాత ప్రభుత్వం మేము పంటను కొంటామని ముందుకు వస్తే ఏలాంటి ఉపయోగం ఉండదన్నారు. మద్దతు ధర రైతులకు అందడం లేదని, మిల్లర్లు, వ్యాపారులకు అందిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతు సంఘం పట్టణ నాయకులు కుంభం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, రైతు సంఘం నాయకులు పిన్నపురెడ్డి మధుసూదన్‌రెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, గడ్డం రాములు, విష్ణుమూర్తి, వెంకటేశ్వర్లు, పుల్లయ్య, మహిళా నాయకురాలు కుంభం లక్ష్మి, రేఖల సుగుణ, సరిత, విజయ, రజిత, తదితరులు పాల్గొన్నారు.