Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
- రెండోవ రోజు కొనసాగిన రైతు సంఘం రాష్ట్ర మహాసభలు
నవతెలంగాణ-నల్లగొండ
దేశంలో దోపిడీ వ్యవస్థ పోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఏచూరి గార్డెన్లో మల్లు స్వరాజ్యం నగర్, మాలి పురుషోత్తంరెడ్డి, గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభ రెండో రోజు సోమవారం కొనసాగింది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జెండాను ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ మహాసభకు వివిధ జిల్లాల నుండి 800 మంది రైతు నాయకులు హాజరయ్యారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్, రైతు మహిళ రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సూర్యాపేట జిల్లా కార్యదర్శి దండ వెంకటరెడ్డి, శెట్టి వెంకన్న, వల్లపు వెంకటేష్, అధ్యక్ష వర్గంగా వ్యవహరించిన ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ భారత దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వ వ్యవస్థలను బీజేపీ నాశనం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ భావజాలని అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నారు. మతోన్మాద బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవాలన్నారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల వల్ల దేశవ్యాప్తంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహమైందన్నారు. ధరలు అమాంతం పెరిగిపోయి ప్రజల మధ్య అంతరాలూ పెరిగాయని పేర్కొన్నారు. మరోవైపు మోడీ ఆర్ఎస్ఎస్ చేతుల్లో కీలుబొమ్మగా మారారని మండిపడ్డారు. బహుళ మతాలు, కులాలు, ప్రాంతాలు ఉన్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపన్నారని విమర్శించారు.
మోడీది నియంతృత్వ పాలన
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పస్య పద్మ(సీపీఐ)
మోడీ ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పాలన కొనసాగిస్తోందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి(సీపీఐ) పస్యపద్మ విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలను దుర్వినియోగం చేస్తోందన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ ప్రతిపక్ష పార్టీలు,నేతలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించి వారినిలొంగదీసుకునే ప్రయత్నంచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చేందుకు లెఫ్టినెంట్ గవర్నర్, గవర్నర్ వ్యవస్థలను ఉపయోగించుకుంటుందని అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఇప్పటినుంచే ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
జాతీయ నాయకులను పూలమాలలతో సన్మానించిన ఆహ్వాన సంఘం నాయకులు
జిల్లా కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండవ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం జాతీయ నాయకులు హన్నన్ మొల్లా, డాక్టర్ విజ్జు కృష్ణన్లను తెలంగాణ రైతు ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
కౌలు రైతులను రైతుగా గుర్తించాలని మహాసభలో తీర్మానం
కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం రైతులుగా గుర్తించి .ప్రభుత్వ పథకాలు వెంటనే అమలు చేయాలని సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రైతు రెండో మహాసభల్లో రాష్ట్ర కమిటీ తీర్మానం చేయగా అందుకు సభ్యులు అంగీకరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర రెండో మహాసభల సందర్భంగా రెండవ రోజు సోమవారం మల్లు స్వరాజ్యం నగర్ ,మాలి పురుషోత్తం రెడి,్డ గొర్ల ఇంద్రారెడ్డి ప్రాంగణంలో ప్రజా ప్రతినిధుల మహాసభలో ప్రజానాట్యమండలి కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు రైతు సంఘం నాయకులను అలరించాయి. రైతాంగ, కార్మిక, కర్షకులు పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కుల పట్ల నృత్యం, గేయ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ మహాసభలో ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి డాక్టర్ విజ్జు కష్ణన్ ,జాతీయ నాయకులు హన్నన్ మొల్ల, సారంపల్లి మల్లారెడ్డి, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, గౌరవాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం, సహాయ కార్యదర్శి మూడు శోభన్, మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి,సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నర్సింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నారి ఐలయ్య, కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఆవాజ్ రాష్ట్ర నాయకులు సయ్యద్ హాషం, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, కళాకారులు కుమ్మరి శంకర్, ఐలయ్య, రవి, సైదులు, ప్రసాద్ అంజమ్మ , జిల్లా నాయకులు బతకన్న, సుంకన్న, సుబ్బరాయుడు,తదితరులు పాల్గొన్నారు.