Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ-చిట్యాలటౌన్
కేంద్ర ప్రభుత్వం చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతరాములు అన్నారు. చిట్యాల పట్టణంలోని స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుండి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి కాలం గడుపుతున్నారన్నారు. సిరిసిల్ల చేనేత కళాకారుల కళా నైపుణ్యాన్ని గుర్తించి పొగడడం సంతోషమేనని, కానీ నరేంద్ర మోడీకి చేనేత మీద ప్రేమ ఉంటే జీఎస్టీని రద్దు చేయాలన్నారు. చేనేత యంత్రాలు వచ్చిన తర్వాత చేనేత కార్మికుల పని తగ్గిందని, కార్మికుల సంఖ్య తగ్గిన వత్తి నైపుణ్యం ఉందన్నారు. చేనేత వృత్తిని ఆధారం చేసుకుని జీవించే కార్మికులు ఎంత కష్టపడినా ఆకలి చావులు మాత్రం ఆగడం లేదని తెలిపారు. చేనేతకు సంబంధించిన 22 రకాల వస్త్రాలను మిల్లులపైన తయారు చేయవద్దని చట్టం ఉన్నా నరేంద్ర మోడీ అధికారంలో కూర్చున్నాక 22 రకాల నుండి 11 రకాల కుదించారని పేర్కొన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఉన్న బడా పారిశ్రామికులకు రాయితీలు ఇవ్వడమే తప్ప, చేనేత కార్మికులను పట్టించుకోవడంలేదన్నారు. చేనేత సంక్షేమ బోర్డును, బున్కర్ భీమాను, యారన్ సబ్సిడీని, సహకార వ్యవస్థలన్నిటిని నరేంద్ర మోడీ రద్దు చేశారన్నారు. సిరిసిల్ల కేటీఆర్ నియోజకవర్గం కాబట్టి రాజకీయ కోణంలో మోడీ జీ20 లోగోను తయారుచేసిన చేనేత కార్మికులను మెచ్చుకోవడం జరిగిందని అన్నారు. నిజంగానే చేనేత కార్మికుల మీద ప్రేమ ఉంటే 20శాతం రిబేటు స్కీము ఎత్తివేసి, చేనేత మీద జీఎస్టీని ఎందుకు విధించారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రభుత్వాలకు ఐటి, ఈడి చేత దాడులు కక్షపూరితంగా చేయిస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యురాలు జిట్టా సరోజ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాసులు, పార్టీ నాయకులు శీల రాజయ్య, రుద్రారపు పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.