Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు
నవతెలంగాణ-చౌటుప్పల్
డిసెంబర్ 13 నుండి 16 వరకు తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్శిటీలోని రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఎస్ఎఫ్ఐ 17వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి వనం రాజు కోరారు. మంగళవారం చౌటుప్పల్ పట్టణకేంద్రంలోని నలంద డిగ్రీ కళాశాలలో మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యావిధానం తీసుకువచ్చి కాశాయీకరణ చేసే దిశగా కుట్ర చేస్తుందన్నారు. రాజ్యాంగ లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోకుండా వారి ఇష్టారాజ్యంగా విద్యా విధానాన్ని తీసుకువస్తుందన్నారు. ఈ విద్యా విధానం వల్ల పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్పొరేటీకరణ విద్యను పెట్టుబడిదారులకు అప్పజెప్తుందని విమర్శించారు. స్కాలర్షిప్పులు, ఫీజు రీయీంబర్స్ మెంట్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె శివ, కళాశాల ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ విష్ణు, రాజశేఖర్, లెక్చరర్ కట్టెల లింగస్వామి, ఎస్ఎఫ్ఐ నాయకులు సాతిరి మనోజ్, తీగుళ్ల శ్రీనివాస్, వాకుడోతు కిరణ్, మహేశ్, శ్రావణ్, ప్రకాశ్ పాల్గొన్నారు.