Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్
నవతెలంగాణ - భువనగిరి
రాష్ట్రంలో కొంతమంది చేస్తున్న యాత్రలు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి కానీ అశాంతికి తోడ్పడకూడదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ అన్నారు. బుధవారం స్థానిక సుందరయ్య భవనంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన జరిగిన మండల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో పెరుగుతున్న ఆకలి, దారిద్య్రం, నిరుద్యోగం లాంటివి పట్టించుకోకుండా వాటి గురించి మాట్లాడకుండా ఊర్ల పేర్లు, ప్రాంతాల పేర్లు మార్చితే అభివృద్ధి జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. అలాంటి మాటలు అశాంతికి కారణమవుతాయన్నారు. రాష్ట్రాల విభజన హామీలు అమలు చేయకుండా దేశంలో అశాంతిని నెలకొల్పే విధంగా ప్రాంతాలు, కులాల, మతాల పేరుతో మనుషుల మధ్య వైశ్యామ్యాలను పెంచుతూ అల్లర్లను ప్రేరేపించే ఉపన్యాసాలు చేయడం సరైన విధానం కాదన్నారు. విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగం, ఆకలి సూచీలో భారతదేశం స్థానం చూస్తుంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎటువైపు వెళుతుందని సందేహం కలుగుతుందన్నారు. ప్రధానంగా దేశంలో రాష్ట్రంలో మూడవిశ్వాసాలను పెంచి పోషిస్తూ మతం ముసుగులో మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ బీజేపీఅధికారం చేస్తుందన్నారు. ఇలాంటి విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శులు సిర్పంగి స్వామి, బొల్లు యాదగిరి,మాయ కృష్ణ, బొడ్డుపల్లి వెంకటేష్, గంగదేవి సైదులు, పగిళ్ళ లింగారెడ్డి, బండారు నర్సింహ, ఎంఎ ఇక్బాల్, మద్దెపురం రాజు, ర్యాకల శ్రీశైలం, పోతరాజు జహంగీర్, బుర్రు అనిల్, కూరేళ్ల బిక్షం, గడ్డం వెంకటేష్, మంచాల మధు పాల్గొన్నారు.