Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామపంచాయతీల ఆదాయానికి గండి
- చోద్యం చూస్తున్న అధికారులు
- రూ. కోట్లు గడిస్తున్న రియల్టర్లు
నవతెలంగాణ-చివ్వెంల
సాధారణంగా ఒక వ్యక్తి ఇండ్లు కట్టుకోవాలంటే అధికారులు సవాలక్ష నిబంధనలు పెడతారు.ఆ ధ్రువపత్రం కావాలి. ఈ అధికారి అనుమతి కావా లంటూ కార్యాలయాల చుట్టూ తిప్పు కుంటారు.అదే రియల్ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం అధికారులకు నిబంధనలు పట్టవు. కనీసం వారి వైపు కూడా తిరిగి చూడరు.మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధంగా రియల్ఎస్టేట్ వెంచర్లు వెలియడమే ఇందుకు నిదర్శనం.అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు విన వస్తున్నాయి.మండలంలోని పలు గ్రామాలలో రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూములుగా మార్పు కూడా చేయకుండానే వెంచర్లు ఏర్పాటు చేసి దర్జాగా ప్లాట్ల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి.జాతీయ రహదారి -365 రోడ్డు నిర్మాణం జరగడంతో రహదారి పక్కన ఉన్న భూములు రూ.కోట్లలో ధరలు పలుకు తుండడంతో రియల్టర్లకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది.ఎవరైనా రియల్ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే అందుకు ప్రభుత్వం నుంచి వివిధరకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది కానీ.అటువంటివి ఏమీ లేకుండానే ముందు ప్లాట్లు చేసి అమ్మేద్దాం...ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకుందాంలేఅన్నట్టుగా రియల్టర్లు వ్యవహరిస్తున్నారు.
గ్రామపంచాయతీ అనుమతుల నిల్...
ప్రభుత్వ నిబంధనల ప్రకారం లేఅవుట్లు చేసిన ప్రాంతంలో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రహదారులు, విద్యుత్,మంచినీరు, డ్రయినేజీ,వివిధ రకాల వసతుల కోసం భూమిని వదిలి గ్రామపంచాయతీ అనుమతులు పొందాలి. వ్యవసాయ భూములయితే రెవెన్యూ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వెంచర్లు సామాజిక అవసరాల గురించి 10 శాతం భూమిని గ్రామ పంచా యతీకి కేటాయించాలి.కానీ రియల్ వ్యాపారులు ఈ నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. నిబంధనలు పాటించకుంటే ఇంటికి గ్రామపంచాయతీ అనుమతి దొరకదు.ఈ విషయంలో ప్లాటు కొన్న వ్యక్తులకు తెలియదు. నిబంధనల ప్రకారం వెంచర్ చేశామని చెప్పి అమాయక ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఐలాపురం గ్రామపంచాయతీ పల్లెప్రకృతివనం పక్కన సర్వే నెంబర్ 99లో సుమారు 311/2 ఎకరాలలో ఏర్పాటుచేసిన వెంచర్ రియల్టర్ గ్రామ పంచాయతీకి 10 శాతం భూమిని కేటాయించకుండా ప్లాట్లు విక్రయి స్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.ఇప్పటికైనా ఉన్నతా ధికారులు, సర్పంచ్ పంచాయతీ పాలకవర్గం స్పందించి అక్రమ వంచర్ల నిర్మాణదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
నోటీసులు ఇచ్చినా స్పందన లేదు
పంచాయతీ కార్యదర్శి-శ్రీకాంత్
ఐలాపురంలో వెలిసిన వెంచర్ యజమానికి నోటీసులిచ్చాం. వెంచర్ యజమాని నుంచి స్పందన లేదు.పైగా గ్రామపంచాయతీకి కేటాయించాల్సిన భూమిని కేటాయించలేదు.గ్రామపంచాయతీకి భూమి ని కేటాయించిన తర్వాతే అనుమతులు ఇస్తాం.