Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదవర్గాల విద్యార్థులను చదువులకు దూరం చేసే కుట్ర
- రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి
- ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల పోస్టరావిష్కరణ
నవతెలంగాణ-నల్లగొండ
సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) డిసెంబర్ 13 నుండి 16వరకు హైదరాబాద్లో జరిగే ఆలిండియా మహాసభల పోస్టర్ను గురువారం జిల్లా కేంద్రంలో జూలకంటి ఆవిష్కరించి మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరారు. ఉన్నత విద్యారంగాన్ని కేంద్ర ప్రభుత్వం శరవేగంగా ప్రయివేటీకరిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో విద్యారంగానికి కనీస నిధులు కేటాయించడం లేదన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ.. ప్రయివేట్ గ్లోబల్ యూనివర్సిటీలను ఆహ్వానించడం హేయమైన చర్య అన్నారు. పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తూ సంపన్న వర్గాలకే చదువులు అన్న మాదిరిగా పాలకుల తీరు ఉందని చెప్పారు. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీలు భారతదేశానికి రావాలని, ఈ విధానం స్వాగతం పలుకుతోందని, తద్వారా ప్రపంచ స్థాయి ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు విదేశాలకు పోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు. విద్యాభివద్ధి పేరుతో ఏర్పాటుచేసే ఈ ప్రయివేటు యూనివర్సిటీలు, అటానమస్ డిగ్రీ కాలేజీలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు ఉండవని పేర్కొన్నారు. అలాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తరగతుల్లోని పేదలకు చదువుకునే అవకాశం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలో ఉన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీకి అధిక నిధులు కేటాయించి మహాత్మా గాంధీ యూనివర్సిటీని అభివద్ధి చేయాలన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ అఖిలభారత మహాసభలకు విద్యావంతులు, మేదావులు విద్యార్థి ఉద్యమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు లక్ష్మి నారాయణ, మాజీ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్, డీవైఎఫ్ఐ నాయకులు కార్తీక్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బిట్టు రేణుక, వీరన్న, సంపత్ పాల్గొన్నారు.