Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-మాడుగులపల్లి
కార్మిక చట్టాలను కాలరాస్తున్న పాలకులకు బుద్ధి చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. మండలంలోని ఇండుగుల గ్రామంలో వీవీఎన్ గార్డెన్లో గురువారం సీఐటీయూ మూడవ మండల మహాసభ నిర్వహించారు. ఈ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ,రాష్ట్రంలో టీఆర్ఎస్ ఇద్దరు పాలకులు కార్మికుల చట్టాలను కాలరాస్తూ కార్మికుల పొట్ట కొడుతున్నారన్నారు. గతంలో ఉన్న కార్మిక హక్కులకు సంబంధించిన చట్టాలను రద్దు చేస్తూ ఇవాళ కనీస వేతనాలు కల్పించనటువంటి పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, వీఆర్ఏలు, ప్రభుత్వ కార్యాలయాలలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు ఇప్పుడు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వని పరిస్థితి దాపరించిందన్నారు. అలాగే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా అదే ధోరణి కాబట్టి దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వీరందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి నిత్యవసర వస్తువుల ధరలు నియంత్రణ చేస్తూ కార్మికులను కాపాడాలని కోరారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల నూతన కమిటీ ఎన్నుకున్నారు. మండల నూతన కన్వీనర్‌గా ఖమ్మంపాటి పరశురాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేశం, జిల్లా నాయకులు రొండి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.