Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన-మఠంపల్లి
సుదీర్ఘకాల పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసిందని, తక్షణమే పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసన బోయిన హుస్సేన్ డిమాండ్ చేశారు. గురువారం మఠంపల్లి మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పోడు సాగుదారుల నుండి స్వీకరించిన 3.45 లక్షల దరఖాస్తులను తక్షణం పరిశీలించి, హక్కు పత్రాలు ఇచ్చి గిరిజన, ఆదివాసీలను ఆదుకోవాలని, అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించామని తెలిపారు. ఈ ఆందోళన ఫలితంగా పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. అటవీశాఖ అధికారులు పోడు సాగుదారులపై దాడులు చేయడం, అక్రమ కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలను జాప్యం చేయకుండా త్వరగా నిర్వహించి పోడు దరఖాస్తులనీటిని గ్రామ కమిటీల స్థాయిలో పరిశీలన ప్రక్రియకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా నాయకులు భూక్య, పాండు నాయక్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాలోత్, బాలు నాయక్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మఠంపల్లి మండల అధ్యక్షులు కంటూ కోటయ్య, జల తిరుపతయ్య, తదితరులు పాల్గొన్నారు.