Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులుకోట రమేష్
నవతెలంగాణ- ఆలేరుటౌన్
బీజేపీ పాలనలో రోజురోజుకు నిరుద్యోగ శాతం పెరిగిపోతుందని డీివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని దినేష్ గార్డెన్ ఆవరణలో నిర్వహిస్తున్న ఆ సంఘం జిల్లా శిక్షణా తరగతులు రెండో రోజు కోట రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగాన్ని రూపుమాపలేదన్నారు. ఇప్పటికీ కేంద్రంలో 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం మాత్రం రోజుగారి యోజన పేరుతో 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని సర్టిఫికెట్లు ఆశ చూపి చేతులు దులుపుకుందని విమర్శించారు. మతం పేరుతో మతోన్మాదం పేరుతో చరిత్రను వక్రీకరించాలని,తప్పుడు చరిత్రను యువతకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ యువత మెదడులోకి ఎక్కిస్తుందన్నారు. మతవైశ్యమ్యాలను రెచ్చగొడుతూ మతం వైపు యువతను తిప్పుతూ బీజేపీ రాజకీయ లబ్ధి పొందుతుందన్నారు. రానున్న కాలంలో నిరుద్యోగంపై మతోన్మాదంపై యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరట కోసం వరస నోటిఫికేషన్లు వేయటమే కాకుండా నిర్దిష్ట కాలపరిమితిలో వేసిన నోటిఫికేషన్ లకు వెంటనే ఉద్యోగాలు వచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ రాజకీయ శిక్షణ తరగతులలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శి బుగ్గ నవీన్, గడ్డం వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధు కృష్ణ, కౌడే సురేష్, ఉప్పలపల్లి బాలకృష్ణ, సహాయ కార్యదర్శులు నాగటి ఉపేందర్, చెన్న రాజేష్, ఎండి ఖయ్యూం, దయ్యాల మల్లేష్ జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.