Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ రాష్ట్ర సహాయకార్యదర్శి బొల్లం అశోక్
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లోనూ గొర్రెల పంపిణీ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని తెలంగాణ గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక కిరాణా ,ఫ్యాన్సీ అసోసియేషన్ భవన్లో నిర్వహించిన ఆ సంఘం సూర్యాపేట పట్టణ మహాసభలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యాదవ, గొల్ల ,కురుమలకే కాకుండా రాష్ట్రంలో వివిధ పట్టణ ప్రాంతంలో ఉన్న యాదవ,గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టారన్నారు. సూర్యాపేట జిల్లాలో మాత్రం మున్సిపాలిటీల్లో పెంపకందార్లకు గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయకపోవడం గొర్రెల ,మేకల పెంపకందారులను మోసం చేయడమేనని విమర్శించారు.జిల్లాలో పట్టణ ప్రాంతాలలో గొర్రెల,మేకల పెంపకందారుల వృత్తి అత్యధికంగా ఉందన్నారు.అనేక సొసైటీలుగా ఏర్పాటు చేసుకొని పెంపకందారులు వృత్తిని కొనసాగిస్తున్నారని, వారికి ప్రభుత్వం గొర్రెల పంపిణీ ప్రారంభించి ఆదుకోవాలని కోరారు.సూర్యాపేట పట్టణంలో ఉన్న సొసైటీలలో సభ్యత్వం లేక అనేకమంది గొర్రెల,మేకల పెంపకందారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సొసైటీ అధ్యక్షులు వారికి సభ్యత్వం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడం మూలంగా పెంపకందారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు అందకపోవడంతో నిరాశకు గురవుతున్నారని తెలిపారు. జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారులు కలుగజేసుకొని అర్హులైన పెంపకం దారులందరికీ సొసైటీలో సభ్యత్వం ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గీత,మత్య్స,చేనేత కార్మికులకు ఇస్తున్నట్టుగానే 50 ఏండ్లు నిండిన పెంపకందారులకు పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.గుర్తింపు కార్డులు, ప్రమాదబీమా వర్తింపచేయాలన్నారు.18 ఏండ్లు నిండిన యాదవ, గొల్ల ,కురుమలకు సొసైటీలో సభ్యత్వం ఇచ్చి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలుచేయాలని కోరారు.వివిధ కారణాల రీత్యా మరణించిన గొర్రెల కాపరుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు సొసైటీల్లో సభ్యులుగా చేర్చి గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెంపకందారుల సంఘం పోరాట ఫలితంగా సాధించుకున్న 1016,559 జీవోలను ప్రభుత్వం వెంటనే అన్ని గ్రామాలలో అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మహాసభకు జిల్లా ఉపాధ్యక్షులు కంచుగట్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు కడెం లింగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరబోయిన రవి, పట్టణ నాయకులు రాజుల నాగరాజుయాదవ్, గోపనబోయిన రవి, బొల్లం మల్లేష్, చిట్లంకి యాదగిరి, గౌనిశ్రీనివాస్, భీమనబోయిన సైదులు,ఏశబోయిన సైదులు, ఆవులయాదగిరి, బొల్లంవెంకన్న, గోపనబోయిన సైదులు, కోడి నరేష్, జక్కలభిక్షం,ఏశబోయిన మహేష్, వల్లాలజానయ్య,ఎల్లావుల వెంకన్న, బండగొర్ల శ్రీశైలం, నల్లమాద నాగరాజు తదితరులు పాల్గొన్నారు.