Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ-నార్కట్పల్లి
బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రారంభించనున్నట్టు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల పరిధిలోని, బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్ట్ను ఎమ్మెల్యే బుధవారం సందర్శించి పనులను పర్యవేక్షించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, జరుగుతున్న పనులను, ఇంకా జరుగవలసిన పనులు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఎస్ఈ, ఈఈ కాంట్రాక్టర్లతో కలిసి జరిగిన పనులను పరివేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలనే ఆలోచనతో కేసీఆర్ ఆదేశాల మేరకు పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో, జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి సహకారంతో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ రంగానికి లక్ష ఎకరాలు సాగునీరు అందించే కార్యక్రమం గురించి, ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందని వారు వెంటనే స్పందించి, ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి నీళ్లు పోయించాలని చెప్పారు. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రాజెక్టు ల్యాండ్ ఆక్వేషన్కు కూడా రైతులు బాగానే సహకారమందిస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా ఒప్పించి తగిన సహాయాన్ని అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సూది రెడ్డి నరేందర్రెడ్డి, ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు యానాల అశోక్ రెడ్డి, సర్పంచులు దుబ్బ మధు మహేశ్వరం, సతీష్, గోసుల భద్రాచలం పాల్గొన్నారు.