Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
గిరిజన సంక్షేమశాఖ ఏవోపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ మాట్లాడుతూ నల్లగొండ గిరిజన సంక్షేమ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏవో అవినీతి అక్రమాలకు కేరప్ అడ్రస్‌గా మారారని తక్షణమే అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం నియమించిన విద్యాయా వాలంటీర్ల నియామకంలో సీనియార్టీ పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని పేర్కొన్నారు. విదేశీ చదువులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందించే సుమారు 20 లక్షల రూపాయలను వారికి అందివ్వకుండా డబ్బుల కోసం పీడిస్తున్నాడని ఆరోపించారు. ఏవో పై సమగ్ర విచారణ జరిపించి తక్షణమే అతనిని సస్పెండ్ చేయాలని గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి బలమైన విద్యార్థి ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు రేణుక, రజిత, గణేష్, స్పందన, అశొక్, కిరణ్, కళ్యాణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.