Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో చర్చలు జరిపిన అమలు చేయని యాజమాన్యం
- లే ఆఫ్ సెటిల్మెంట్ పేరుతో 41 మంది కార్మికుల తొలగింపునకు యాజమాన్యం ప్రయత్నం
- పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించిన కార్మికులు
- కార్మికుల తొలగింపు తక్షణమే విరమించుకోవాలి
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ- చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం ఎస్ లింగోటం గ్రామ పరిధిలోని ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికుల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. మూడు నెలల క్రితం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టిన విషయం విధితమే. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ప్రతిష్ట ఇండిస్టీస్ కార్మికుల ఆందోళనలకు మద్దతు తెలిపిన తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. కంపెనీ యాజమాన్యం కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి సమక్షంలోనే కార్మికులకు హామీ ఇచ్చారు. కానీ నేటికీ యాజమాన్యం ఇచ్చిన హామీ అమలు కాలేదు. పైగా 41 మంది కార్మికులను లే ఆఫ్ సెటిల్మెంట్ పేరుతో తొలగించడానికి ప్రతిష్ట ఇండిస్టీస్ యాజమాన్యం చర్యలు చేపట్టింది. దీంతో కంపెనీ కార్మికులు గురువారం ఆందోళన చేపట్టారు. పరిశ్రమ ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి,కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ల సమక్షంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయకుండా పరిశ్రమ యజమాన్యం కార్మికుల జీవితాలతో ఆడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నాటినుండి 43 మంది కార్మికులను పనులలోకి తీసుకోకుండా కాలయాపన చేశారన్నారు. మూడు నెలలుగా కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా బైట ఉంచి బుధవారం రాత్రి ఆ కార్మికులను లే ఆఫ్ సెటిల్మెంట్ పేరుతో తొలగిస్తున్నామని కంపెనీ యాజమాన్యం చెప్పడం దారుణమని అన్నారు. యూనియన్ నాయకులతో,కార్మికులతో చర్చించకుండా వారి అనుమతి లేకుండా ఒంటెద్దు పోకడలతో ఫుల్ పర్మినెంట్ సెటిల్ మెంట్ అని 41 మంది పేర్లతో నోటీిస్ వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏకపక్ష నిర్ణయం తీసుకొని పరిశ్రమ యజమాన్యం కార్మికుల పొట్టగొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్టోబర్ 13న కార్మిక శాఖ మంత్రి సమక్షంలో పరిశ్రమ పరిధిలో యండి ఫణిరాజ్ కార్మికులు కార్మికులకు ఇచ్చిన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి సమక్షంలోనే పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్ సమ్మె శిబిరం వద్దకు వచ్చిరూ. 3200 వేతనం పెంచుతామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ జరిగిన ఒప్పందాన్ని అమలు చేయకుండా కార్మికుల పై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. యాజమాన్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.అక్రమ లే ఆఫ్ సెటిల్ మెంట్ని ఎత్తి వేయాలని లేని పక్షంలో జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో చేపడతామని తెలిపారు. ఈ ధర్నాకు సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బత్తుల దాస్, టీిఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు డిల్లీ మాధవ రెడ్డి, టీఆర్ఎస్ యువజన నాయకులు ఉప్పు క్రిష్ణ, గ్రామ సర్పంచ్ ఆకుల సునీత శ్రీకాంత్,సింగిల్ విండో వైస్ చైర్మెన్ చెన్నగోని అంజయ్య,కాంగ్రెస్ నాయకులు చేవెళ్ల వెంకటేష్ కార్మికులకు మద్దత్తు తెలిపారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎండి.పాషా అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పరిశ్రమ యూనియన్ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం నాయకులు డీవీఎం, లలిత, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.