Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికులు, రైతులకు నష్టం కలిగించే మోడీ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి
- చరిత్ర పోరాటాలకు పుట్టినిల్లు చిట్యాల
- సీఐటీయూ మహాసభల్లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
- ఘనంగా ప్రారంభమైన జిల్లా మహాసభలు
- జాతీయ రహదారిపై కళాకారులు, కార్మికుల భారీ ప్రదర్శన
నవతెలంగాణ-చిట్యాలటౌన్
దేశభక్తి పేరుతో ఓట్లు సాధించాలనే ఆలోచనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఆస్తులను గుండు గుత్తగా అమ్ముతోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సీఐటీయూ 12వ జిల్లా మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశాన్ని కారు చౌకగా అమ్మి కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలిగించే పాలకులను, మోడీ ప్రభుత్వాన్ని తాటి చెట్టు లోతు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. కార్మికులకు పర్మినెంట్ కల్పించాలన్నా స్థానిక ఉద్యోగ అవకాశాలు ఉండాలన్నా, పెడచెవిన పెట్టే పాలకులకు దీటుగా 2023 ఏప్రిల్లో చలో పార్లమెంటుకు పిలుపు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఐటీయూ జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ...నల్లగొండ జిల్లాలో చిట్యాలకు కార్మికుల, రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఎన్నో పోరాటాలు చేసిందని, పోరాటాల బలమైన చరిత్ర సీఐటీయూదేని, పోరాటాలకు పుట్టినిల్లుగా పేరు గాంచిందన్నారు. నల్లగొండ జిల్లా అసంఘటిత రంగం కార్మికులకు, హమాలీ కార్మికులకు జరిగిన సమ్మె ఆందోళన పోరాటాలకు ఘనమైన చరిత్ర ఉందని, అట్లాంటి పోరాటంలో 45 రోజుల పాటు తాను ఆ రోజుల్లోనే రహస్య జీవితం గడపాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు చిట్యాల కార్మిక వర్గంలో 32 మంది సీఐటీయూలో పని చేస్తూ మరణించిన చరిత్ర చిట్యాల గడ్డకు ఉందని తెలిపారు.మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ కార్మిక సంఘాల పోరాటాలకు ముందుగా నిలిచేది సీఐటీయూ యేనని కార్మిక సంఘం అంటేనే ముందుగా గుర్తొచ్చేది అందరికీ సీఐటీయూ సంఘమేనని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు చట్టాలకు కుదించిందన్నారు. ఈనాటి పాలకులు యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఈ చట్టాలు తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిట్యాల మున్సిపల్ చైర్మెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ 19వ శతాబ్దంలో కారుల మార్క్స్ ఐడియాలజీ ప్రకారం కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిందని, లెనిన్, స్టాలిన్, చేగువేరా, మావోలు, కమ్యూనిస్టు పార్టీని ముందుకు తీసుకెళ్లారన్నారు. నైజాం, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సైదులు పోరాటం జరిగిందన్నారు. భారతదేశంలో పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటుకు పార్లమెంటుకు ఎన్నికై సైకిల్ పై పార్లమెంటు సమావేశాలకు హాజరైన చరిత్ర కమ్యూనిస్టులకే దక్కిందన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో తాను సంపూర్ణ మద్దతు ఇస్తానని తెలిపారు. సీఐటీయూ మహాసభల ప్రారంభ సూచకంగా ఏర్పాటు చేసిన జెండాను సంఘం రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు ఆవిష్కరించారు. మొదటగా చిట్యాల పట్టణ ప్రధాన రహదారి గుండా కార్మికులు, కళాకారులు సీఐటీయూ నాయకులు ఎర్రజెండాలు చేతబట్టి భారీ ప్రదర్శన చేశారు. చిన్నపాక లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు డబ్బికార్ మల్లేష్, నారబోయిన శ్రీనివాసులు, ఎండీ. సలీం, దండెంపల్ల సత్తయ్య, ఏ.సైదులు, చింతపల్లి బయన్న, వెంకటయ్య, ప్రమీల, వివిధ ప్రజాసంఘాల నాయకులు అవిశెట్టి శంకరయ్య, పామన గుండ్ల అచ్చాలు, జిట్టా సరోజ, మల్లం మహేష్, ఆరూరి శ్రీనివాసులు, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దలు, చంద్రమౌళి, వేణు తదితరులు పాల్గొన్నారు.