Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోమటిరెడ్డికి ఏఐసీసీ షాక్..!
- టీపీసీసీ, డీసీసీలకు కొత్త కమిటీలు..
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అనుకున్నది సాధించారు. వచ్చే ఎన్నికలకు తాను కోరుకున్న వారితో జంబో టీంకు ఆమోద ముద్ర వేయించుకున్నారు. టీపీసీసీ కొత్త కమిటీలకు ఏఐసీసీ ఆమోదముద్ర వేసింది. అదే సమయంలో మునుగోడు బై పోల్ వేళ తనను ఇబ్బంది పెట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏ ప్రాధాన్యత దక్కలేదు. ఏ కమిటీలోనూ స్థానం కల్పించలేదు. మిగిలిన సీనియర్లు, జూనియర్లతో కలిపి పార్టీకి కీలక మైన మూడు కమిటీలను ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం ఏంటనేది కీలకం కానుంది.
నవతెలంగాణ-నల్లగొండ
కొంత కాలంగా టీపీసీసీ కొత్త కమిటీలపైన ఏఐసీసీ రాష్ట్ర నేతలతో చర్చలు చేస్తోంది. సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టిన తరువాత పార్టీ పదవుల ప్రక్షాళనకు నిర్ణయించారు. టీపీసీసీ నుంచి ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత రాహుల్ గాంధీ సూచనల మేరకు కేకే. వేణుగోపాల్ పర్యవేక్షణలో ఈ జాబితాలకు ఆమోద ముద్ర పడింది. కొత్తగా మూడు ప్రధాన కమిటీలను ప్రకటించారు. అందులో భాగంగా 18 మందితో కీలకమైన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి మాణిక్యం ఠాగూర్ ఛైర్మెన్‌గా వ్యవహరిస్తారు. సభ్యులుగా రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్.హనుమంత రావు, పొన్నాల లక్షయ్య, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర్ రాజ నర్సింహ, రేణుకా చౌదరి, బలరాంనాయక్, మధుయాష్కీ, చిన్నారెడ్డి, శ్రీధర్‌బాబు, వంశీచందర్‌రెడ్డి, సంపత్‌కుమార్ ఉన్నారు. పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేతలందరికీ దాదాపుగా ఈ కమిటీలో స్థానం కల్పించారు.
వర్కింగ్ ప్రెసిడెంట్లు, రాష్ట్ర కమిటీ...
ఏఐసీసీ ప్రకటించిన మరో రెండు ముఖ్యమైన కమిటీలను ఖరారు చేసింది. అందులో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రస్తుతం ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చింది. తాజా కమిటీలో అజారుద్దీన్‌తో పాటుగా మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మహేష్‌గౌడ్‌తో పాటుగా ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కొనసాగిస్తూ ఏఐసీసీ నిర్ణయించింది. ఇక సీనియర్లు ముఖ్య నేతలతో 40 మందితో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీని ప్రకటించింది. అందులో ప్రస్తుత ఎమ్మెల్యేలతో పాటుగా పలువురు నేతలకు అవకాశం దక్కింది. జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కమటీని నియమించారు. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు విభాగాలుగా విభజించి బాధ్యతలు కేటాయించారు. రేవంత్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన సమయం నుంచి డీసీసీ అధ్యక్షుల మార్పు అంశంపైన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు 26 జిల్లాల అధ్యక్షుల మార్పుకు ఏఐసీపీ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ జంబో టీంల ద్వారా రేవంత్ రానున్న ఎన్నికల సంగ్రామానికి సిద్ధం కానున్నారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి షాక్ ఇచ్చిన ఏఐసీసీ...
కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఏఐసీసీ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. కోమటిరెడ్డి దాదాపు రెండు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్‌లో ఉన్నారు. తాజాగా ఆయన సోదరుడు రాజగోపాల్ కాంగ్రెస్ వీడీ బీజేపీలో చేరారు. మునుగోడులో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడారు. ఆ సమయంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలతో నోటీసులు అందుకున్నారు. వాటికి కోమటిరెడ్డి సమాధానం ఇచ్చారు. కాని టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో కలిసి సాగేందుకు ఆయన సిద్దంగా లేరు. ఇదే సమయంలో కోమటిరెడ్డి, రేవంత్ మధ్య ఆ గ్యాప్ భర్తీ చేసేందుకు పార్టీ హైకమాండ్ ఆసక్తి చూపలేదు. ఆయన అసలు కాంగ్రెస్‌లో ఉంటారా లేదా అనే చర్చ సాగుతోంది. ఈ సమయంలో ఏఐసీసీ ప్రకటించిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు లేకపోవటంతో ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.