Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని, ఆ విధానాలతో దేశం ప్రమాదకర పరిస్థులలోకి తీసుకెళుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక ఎంవీఎన్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పోరేట్ అనుకూల విధానాలతో ప్రభుత్వ రంగం నాశన మవుతుందన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా అమ్ముతూ దేశాన్ని అంగడి సరుకుగా మార్చారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుజరాత్ మినహా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించే విధంగా వ్యవరిస్తూ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను ఖునీ చేస్తుందన్నారు. మోడీ దేశ రాజ్యాంగాన్ని రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందాడాని విమర్శించారు. ముస్లింలను రెండో తరగతి పౌరులుగా చూస్తూ దాడులు, హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. బిజెపి విధానాలను ప్రజలు ప్రతిఘటిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడం కోసం లౌకిక, ప్రజాస్వామ్య, అభ్యుదయ, సామాజిక శక్తులు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కోట గోపి, జే. నర్సింహారావు, పులుసు సత్యం, వీరబోయిన రవి తదితరులు పాల్గొన్నారు.