Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
జిల్లా గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో ఏవో నిర్లక్ష్యం వల్ల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకారం నరేష్, ఖమ్మం పాటి శంకర్ ఆరోపించారు. ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా కమిటీ అద్యాయనం యాత్రలో భాగంగా శుక్రవారం మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించాలని ఉద్దేశంతో గిరిజన సంక్షేమశాఖ ద్వారా అధిక నిధులు కేటాయించి, గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని చూస్తుంటే కలెక్టర్ కార్యాలయంలో ఏవో గత నాలుగు నెలలుగా గిరిజన ఆశ్రమ పాఠశాలలకు, గిరిజన వసతి గహాలకు వచ్చే బడ్జెట్ విడుదల చేయకుండా గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అందించే మెనూ ప్రకారం భోజనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ వారి నుంచి రాష్ట్రంలో అన్ని జిల్లాలకు డైట్ చార్జీలు నిమిత్తం బడ్జెట్ విడుదల చేస్తే ఇందులో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా గత ఐదు నెలల క్రితమే డైట్ బడ్జెట్ రిలీజ్ చేసినప్పటికీ నేటి వరకు పంపిణీకి నోచుకోలేదన్నారు. వసతి గహ సంక్షేమ అధికారులు బడ్జెట్ పంపిణీకి ఏవోకి పర్సంటేజ్ ఇస్తేనే రిలీజ్ చేస్తానని బడ్జెట్‌ని ఇప్పటివరకు పంపిణీ చేయలేదని ఆరోపించారు. దీంతో ఆర్థిక నిర్వహణ వ్యయం పెరిగి హాస్టల్లో నిర్వహణ జిల్లాలో సజావుగా సాగడం లేదన్నారు. తక్షణమే డైట్ బడ్జెట్ రిలీజ్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బూడిగ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ :జిల్లాగిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఏవో నిర్లక్ష్యమా? గిరిజన విద్యార్థుల శాపమోగాని గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజన అందటం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కుర్ర సైదానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యయనం యాత్రలో భాగంగా పట్టణంలో గిరిజన హాస్టల్ విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు జగన్ నాయక్, దామరచర్ల మండల కార్యదర్శి వీరన్న, ఉపేంద్ర, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.