Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యంపై ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు మహాజన సోషలిస్టు పార్టీ (ఎమ్మెస్పీ) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఎమ్మెస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జి బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన జరిగినఈ ముట్టడికి ముఖ్యఅతిథిగా ఎంఎస్పీ నల్లగొండ జిల్లా కోఆర్డినేటర్ ఆడపు నాగార్జున మాదిగ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ గత 28 ఏండ్లుగా ఉద్యమం చేస్తుందని తెలిపారు. వర్గీకరణకు అన్ని పార్టీల మద్దతు తెలిపి మాదిగలను మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి కూర్చున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాదిగల చిరకాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టి వెంటనే ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జిలు మేడి శంకర్ మాదిగ, మచ్చ ఏడుకొండలు మాదిగ, కోమిరే స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి బోడ సునీల్ మాదిగ, జిల్లా కోఆర్డినేటర్ ఇరిగి శ్రీశైలం, కందుల మోహన్, విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాసులు, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొత్త ఎంకన్న, కురుపాటి కమలమ్మ, బొజ్జ దేవయ్య, మారుపాక గోపాల్, పోతెం సాహాదేవుడు, బొజ్జ చిన్న, కత్తుల సన్నీ, ఎరసాని గోపాల్, రవీందర్, దైద రవి, బొర్రామోష, బిపంగి అర్జున్, తదితరులు పాల్గొన్నారు.