Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
నానాటికి ధ్వంసం అవుతున్న పర్యావరణమే విపత్తులకు ప్రధాన కారణమని ఎంజీయూ రిజిస్టర్ ఆచార్య తుమ్మ కృష్ణారావు అన్నారు. శుక్రవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలియజేశారు. విపత్తుల నిర్వహణపై సామాన్య ప్రజలకు సైతం సరైన అవగాహనలు కల్పించాలని, అందులో విద్యార్థులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. జాతీయ రిమోట్ సెన్సింగ్ సంస్థ, ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ సీఎస్ మూర్తి మాట్లాడుతూ నేడు మన దేశం శాటిలైట్ల అభివృద్ధి ద్వారా మేలైన సమాచారాన్ని త్వరితగతిన అన్ని స్థాయిల్లో చేర్చడం సాధ్యపడుతుందని గుర్తుచేశారు. కరువు కాటకాల నివారణలో జియో స్పెషల్ అప్లికేషన్స్ పాత్ర అనే అంశంపై ప్రసంగించారు. జలసాధన సమితి చైర్మెన్ దుశ్చర్ల సత్యనారాయణ ఫ్లోరోసిస్ నివారణపై ప్రసంగిస్తూ నల్లగొండ కేంద్రంగా ఫ్లోరోసిస్ నివారణకు జరిగిన పోరాటాలను విద్యార్థులకు వివరించారు. ఫ్లోరోసిస్ మహమ్మారి నివారణకు త్రాగునీరు, వ్యవసాయానికి కృష్ణా జలాలే శాశ్వతమైన పరిష్కారమని పేర్కొన్నారు. తాను తన సొంత భూమిలో అభివృద్ధి చేసిన అడవిని గూర్చి విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్ఐడీఎం జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ డాక్టర్ ఎఎల్. హల్దార్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో విపత్తులపై మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంతో కలిసి పరిశోధనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా కరువు కాటకాలు, పట్టణ ప్రాంత వరదలు, పర్యావరణ మార్పులు, పులిచింతల లాంటి ప్రాంతాల్లో సంభవిస్తున్న భూకంపాలు, ఫ్లోరోసిస్ అంశాలపై దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ లక్ష్మళ్ళ మధు, రాగుల నికిత, లక్ష్మీ ప్రసన్న, విద్యార్థులు పాల్గొన్నారు.