Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు
- జిల్లా కమిటీ సమావేశంలో జూలకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
దేశంలో ప్రతి పక్షాలను బలహీన పర్చాలని బీజీపీ కుట్ర చేస్తున్నదని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. మంగళవారం నల్లగొండ సీపీఐ(ఎం) కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మోడీ నియంతృత్వ పాలన సాగిస్తున్నాడని, ఒకే దేశం ఒకే పార్టీ అధికారంలో ఉండాలనే లక్ష్యంతో కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. డబ్బులతో ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడని, అందులో భాగంగానే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలు ఉదాహరణలుగా ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారా దత్తం చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నాడని, ప్రజల దష్టి మరల్చడానికి మోడీ కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీజేపీ ఆగడాలను అడ్డుకునేందుకు కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ పోరాడుతుందని, అందుకే ఆ పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. బీజేపీపై పోరాడినంతకాలం ఆ పార్టీతో కలిసి పోరాటాలు చేస్తామని చెప్పారు. కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, తానే అక్కడ ప్రభుత్వం వారికి అవకాశం ఇవ్వకుండా ప్రజా సంక్షేమం కోసం పాలన సాగిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
వ్యకాస రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి
ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. భారీ ప్రదర్శన ఉంటుందని జిల్లా నుండి పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు తరలిరావాలని కోరారు. ఈ బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ హాజరవుతున్నారని తెలిపారు. ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి అధ్యక్షతన జఠిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరా రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, కూన్రెడ్డి నాగిరెడ్డి, మహమ్మద్ హాసం, బండ శ్రీశైలం, పాలడగు నాగార్జున, లక్ష్మీనారాయణ, మండల కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.