Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గౌస్‌కు వైద్య ఖర్చుల కోసం రూ.2.50 లక్షల ఎల్ఓసీ
- జ్యూస్ సెంటర్ ఏర్పాటుకు రూ.4 లక్షలు మంజూరు
- జ్యూస్ బండిని ప్రారంభించి అండగా నిలిచిన మంత్రి
నవతెలంగాణ-సూర్యాపేట
నిరుపేద కుటుంబానికి చెందిన వికలాంగుడికి ఇచ్చిన హామీని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అమలు చేసి అండగా నిలిచారు. ఆ కుటుంబానికి ఆపద్బాంధవుడయ్యారు. జిల్లా కేంద్రానికి చెందిన షేక్ నజీర్ పాషా జ్యూస్ బండి నడుపుతూ జీవనం కొనసాగించేవాడు. నజీర్ పాషాకు షుగర్ వ్యాధి రావడంతో తన రెండు కాళ్లు తీసివేశారు. నిమ్స్‌లో ఆపరేషన్ సమయంలో ప్లాస్టిక్ కాళ్ళ ఏర్పాటుకు మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరగా వెంటనే ఎల్ఓసీ ద్వారా 3లక్షల రూపాయలను అందించారు. అనంతరం కుటుంబం గడవడం ఇబ్బందిగా మారిందని మంత్రిని ఇటీవలే మరోసారి కలిసి జ్యూస్ బండి ఏర్పాటు చేయాల్సిందిగా అందుకు తగిన సాయం అందించమని నజీర్ పాష విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా కావలసిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన మంత్రి ప్రపంచా వికలాంగుల దినోత్సవ సందర్భంగా సదరు బాధితుడు నజీర్ పాషకు ప్లాస్టిక్ కాళ్ల నిమిత్తం రూ.4.50 లక్షల అందజేశారు. అంతేకాకుండా త్వరలో జ్యుస్ షాపుని ఏర్పాటు చేయించి తాను స్వయంగా వచ్చి ప్రారంభిస్తానన్న మంత్రి ఆ మేరకు శుక్రవారం పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్లో సదరు వికలాంగుడి జ్యూస్ బండిని ప్రారంభించి ఆ కుటుంబానికి బతుకుదెరువును చూపించారు. దీంతో వికలాంగుడి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్, పట్టణ అధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కౌన్సిలర్లు జ్యోతి శ్రీ విద్య కరుణాకర్, భరత్ మహాజన్, భాషా, సుంకరి రమేష్, అనంతుల యాదగిరి, కో ఆప్షన్ సభ్యులు రియాజుద్దిన్, సలీం, తాహెర్ భారు, నజీర్, జాని, ఉస్మాన్, కరాటే సయ్యద్, నయీమ్ , గౌస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.