Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండవరోజు నిరాహార దీక్షలో దండెంపల్లి సత్తయ్య
నవతెలంగాణ-నల్లగొండ
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయం ముందు రెండవ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలను సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా గ్రామీణ నీటి సరఫరా విభాగంలో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వీరిని మిషన్ భగీరథ అనే పేరు మార్పు చేశారు తప్ప వీళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. అతి తక్కువ వేతనాలు ఇస్తూ నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతినెల మొదటి తేదీన వేతనాలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ నీటి మూటగానే మిగిలిందని ఆరోపించారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించి అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సక్రమంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లు రవీంద్రకుమార్ పాల్గొని మద్దతు తెలిపారు. రెండవ రోజు నిరాహార దీక్షలో తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్లకొండ శంకర్, ఉపాధ్యక్షులు సుంకరి సైదులు, ప్రచార కార్యదర్శి ఉయ్యాల మురళి, సహాయ కార్యదర్శి నామ సైదులు, గుర్రం వెంకటేష్ బెజవాడ మహేష్, అంబటి వేణు, స్వామి తదితరులు పాల్గొన్నారు.