Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికుల సమ్మెకు జూలకంటి మద్దతు
నవతెలంగాణ-మిర్యాలగూడ
మిషన్ భగీరథ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని అవంతిపురం ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద మిషన్ భగీరథ కార్మికుల రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన మద్దతు తెలిపి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జూకంటి మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికులకు గత 4 నెలల నుండి వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నారని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కార్మికులు ఉద్యమాలు చేస్తేనే వారికి వేతనాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. అలాకాకుండా ప్రతి నెల మొదటి తారీఖున వారికి వేతనాలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీిఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కనీస వేతన చట్టం అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిషన్ భగీరథ కార్మికులను సమీకరించి సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారు మల్లేష్, రైతుసంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవినాయక్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మల్లు గౌతమ్‌రెడ్డి, మిషన్ భగీరథ కార్మికులు రవి, వేణు, సందీప్‌రెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.