Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు అర్ఎల్.మూర్తి
నవతెలంగాణ - భువనగిరి
ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పరిరక్షించు కుందామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్.మూర్తి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఆ సంఘం జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశి విశ్వవిద్యాలయాలకు దేశంలోకి రెడ్ కార్పెరేట్ పరుస్తూ యూజీసీ మార్గదర్శకాలు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. దీనిద్వారా విద్యను విదేశీ విశ్వవిద్యాలయాల పేరుతో వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడమే అని అన్నారు. దేశంలో ప్రపంచం గర్వించే ప్రభుత్వ విశ్వ విద్యాలయాలు ఉన్నా వాటిని అభివద్ధి చేయకుండా ఎవరి ప్రయోజనాల కోసం విదేశీ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విదేశీ విశ్వ విద్యాలయాలు 200 వరకు దేశంలో వివిధ యూనివర్సిటీల బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని యూజీసీ చెబుతుందన్నారు. ఇది అమలు అయితే దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాలు ధ్వంసమయ్యే పరిస్థితి దాపురిస్తుందనిన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ముసుగులో భాగంగానే ఇలాంటి విధానాలు ప్రభుత్వం వేగవంతంగా అమలు చేస్తుందన్నారు. దేశభక్తి గురించి గొప్పగా చెప్పే మోడీ ప్రభుత్వం విదేశీ సంస్థలకు విద్యా రంగాన్ని అమ్మడం ఏ దేశభక్తి అని ప్రశ్నించారు. దేశంలోకి తీసుకువస్తున్న విదేశీ యూనివర్సిటీలకు వ్యతిరేకంగా అందరూ పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షులు కల్లూరి మల్లేషం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు,జిల్లా సహాయ కార్యదర్శి చింతల శివ జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా రాజు, వేముల నాగరాజు పాల్గొన్నారు.