Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జులూరు గౌరీశంకర్
నవతెలంగాణ-కోదాడరూరల్
కృష్ణపట్టి ప్రాంతంలో వెలసిన సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలు విద్యాలయాలకు భవన నిర్మాణ ప్రదాతలు కండి అని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మెన్ జులూరు గౌరీశంకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని మేళ్ళ చెరువు కాశీనాథం నాగరత్నమ్మ కళ్యాణ మండపంలో జరిగిన కొండపల్లి రామనుజరావు సంస్మరణ సభలో ''మరుపురాని మాస్టర్.. మా సారు'' పేరిట వెలువరించిన స్మతి సంచికను జూలూరు గౌరీశంకర్, విశ్రాంత అధ్యాపకులు మంత్రిప్రగడ భరతరావు, శ్రీరామకవచం వెంకటేశ్వర్లు, డాక్టర్ జాస్తి సుబ్బారావులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల భవన నిర్మాణాలకు ప్రభుత్వ స్థలాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. భవన నిర్మాణాలు చేపట్టేందుకు సిమెంటు పరిశ్రమలు స్వచ్చందంగా ముందుకు వస్తే వారిపేర్లు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు. తమ ఫ్యాక్టరీల ఉత్పత్తులకు భూమిక అయిన ఈ ప్రాంతం మీద వారికున్న ప్రేమను చాటు కోవాలన్నారు. ఆసియా ఖండంలోనే అత్యధిక సిమెంటు ఫ్యాక్టరీలు వెలయటానికి సున్నపు రాయిని అందించిన నేలగా కష్ణపట్టే ప్రాంతం నిలుస్తుందని, ఈ ప్రాంత పిల్లలు చదువుకుంటున్న గురుకుల విద్యాలయాలకు సిమెంటు ఫ్యాక్టరీలు శాశ్వత భవనాలు నిర్మించి ఈ నేల రుణం తీర్చుకోవాలని ఆయన కోరారు. సీిఎస్ఆర్ నిధులతో ఈ ప్రాంతంలోని గురుకుల భవన నిర్మాణాలను చేపట్టేందుకు ముందుకు వస్తే అది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. సిమెంటు పరిశ్రమల యాజమాన్యాలు దాతలుగా ముందుకు వస్తే కొండపల్లి రాఘవమ్మ రంగారావుల మాదిరిగా ఈ ప్రాంత ప్రజల మనోఫలకాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు, పట్టణ వాసులు, నాయకులు పాల్గొన్నారు.