Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు
- నిద్రమత్తులో అధికారులు
నవతెలంగాణ-నల్లగొండ
చట్టాలెన్ని వచ్చినా అక్రమార్కులకు చుట్టాలుగానే మారుతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో అవినీతిపరుల ఆగడాలు 'మూడుపువ్వులు ఆరు కాయలు' అన్న చందంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రధానంగా నల్లగొండ పట్టణం మామిళ్లగూడ, ఆర్జాలబావి, గంధవారిగూడెం, చండూరు మండలంలో బంగారిగడ్డ, అంగడిపేట, కట్టంగూరు మండల కేంద్రం నుంచి నల్లగొండకు వచ్చే మార్గంలో, దేవరకొండ పట్టణంలోని డిండి రోడ్డు, చందంపేట మండలంలో బొగ్గులదోణ, బాపనకుంట, హుజూర్ నగర్లో గరిడేపల్లి రోడ్డులో రైస్ మిల్లుల వెనుక భాగంలో, చింతపల్లి, మల్లేపల్లి, సూర్యాపేట, గరిడేపల్లి, చౌటుప్పల్, నారాయణపూర్ ప్రాంతాల్లో వందల ఎకరాల్లో సుమారు 350కిపైగా నిర్వాహకులు బట్టీలను ఏర్పాటు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలకు ఇటుకలను వాడు తుండడంతో నిర్వాహకులు అనుమతుల్లేకుండానే యథేచ్ఛగా ఇటుకబట్టీలు నిర్వహిస్తున్నారు. అటవీ కలప, బొగ్గును ఇటుకలు కాల్చేందుకు వినియోగి స్తున్నా సంబంధిత అధికారులు మొద్దునిద్ర వీడడం లేదన్న విమర్శలు బహిరంగంగానే వినవస్తున్నాయి. జిల్లాలోని పలు మండలాల శివారులో ఇటుక బట్టీల నిర్వాహణ ఏండ్ల నుంచి జరుగుతూనే ఉంది. ఈ బట్టీలను ఏర్పాటుచేయాలంటే రెవెన్యూ అధికారులు అనుమతులు తప్పనిసరి. అయితే అనుమతులు లేకుండానే యథేచ్ఛగా ఇసుకబట్టీలను నిర్వాహకులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ అనుమతుల్లేకుండా అంతర్రాష్ట్ర కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ చత్తీష్‌ఘడ్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఏజెంట్ల ద్వారా కార్మికులను పిలిపించుకొని వారి ద్వారా తమ పనులను కొనసాగిస్తున్నారు.
పచ్చని పొలాలలో సైతం...
భూ పరిరక్షణ చట్టం 129/12లో పొందుపరిచిన విధంగా వ్యవసాయానికి పనికిరాని భూముల్లో ఇటుక బట్టీలను నిర్వహించాలి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలను విరుద్ధంగా పంటపొలాల్లో, హైవే రోడ్ల పక్కన ఇటుకబట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సంబంధిత అధికారులకు మామూలు చెల్లించి అడ్డదారుల్లో బట్టీలు నిర్వహిస్తున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పచ్చని పంటపొలాల పక్కన ఇటుకబట్టీలు వేస్తుండడంతో ఇటుకబట్టీల ప్రభావం పంటపొలాలపై పడి పంటలు నష్టపోతున్నామని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ అండదండలతో నిర్వాహకుల హవా...
ఇటుకబట్టీల వ్యాపారులు రాజకీయ అండదండలతో అనుమతులు లేకుండా విద్యుత్‌చౌర్యం, కలప అక్రమరవాణా చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించు కోకపోవడం మూలంగా వారు ఇష్టానురాజ్యంగా దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనింగ్, రవాణాశాఖ నుంచి అనుమతులు నిల్...
సాధారణంగా ఇటుక బట్టీల్లో వాడే మట్టి ఇసుకకు సంబంధిత శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా ప్రభుత్వానికి ఎటువంటి పన్నులు చెల్లించకుండా మట్టిని, ఇసుకను వాడుతున్నట్టు సమాచారం. ఇటుక బట్టీలో కావలసిన నీటిని అక్రమంగా వాగులు, కుంటలు, కాల్వలు, చెరువులకు మోటార్లు ఏర్పాటు చేసి నీటిని వాడుకుంటున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
కార్మికశాఖ అనుమతులు లేకుండానే..
ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మొత్తంలో కూలీలను తీసుకువచ్చి వారి వివరాలను సంబంధిత శాఖకు తెలియజేయకపోవడం...కనీస వేతనాలు చెల్లించకపోవడం, నిర్బంధ కూలీలుగా భావించడం, వారికి కనీస అవసరాలైన వసతి తాగునీరు ఏర్పాటు చేయడం లేదు. పర్యావరణానికి కాలుష్యం జరిగే విధంగా బట్టీలను నిర్వహిస్తున్నారు. పర్యావరణ కాలుష్య నియంత్రణశాఖ నిబంధనల ప్రకారం ఇటుక బట్టీలు జనావాస ప్రాంతాలకు 1కిలోమీటర్ల దూరంలో, పంట పొలాలకు 100 మీటర్ల దూరంలో, హైవేకు 200 మీటర్ల దూరంలో ఉండాలి. ఇటుకలు కాల్చిన తర్వాత వచ్చే బూడిదను నిర్దేశించిన ప్రాంతాలకు తరలించాలి. కానీ ఇవేమీ చేయకుండా వాతావరణ కాలుష్యం జరిగే విధంగా ఉంచుతున్నారు. దీనికి తోడు అక్రమ కలప బొగ్గును ఇటుక బట్టీల్లో ఇటుకలు కాల్చడానికి వాడుతుండడంతో చెట్ల సంఖ్య తగ్గి కాలుష్యం పెరుగుతుంది.
ఉచిత విద్యుత్తును వాడేస్తున్నారు...
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తోంది. కొందరు ఇటుక బట్టీల నిర్వాహకులు పంట పొలాల్లో ఉన్న బోరు బావుల నీటిని ఇటుక తయారీకి వినియోగిస్తున్నారు. అక్కడ పనిచేసే కార్మికుల గృహావసరాలకు కూడా వ్యవసాయ విద్యుత్తును వాడేస్తున్నారు. ఈ దుర్వినియోగాన్ని కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం
జయచంద్రారెడ్డి (ఆర్డీవో నల్లగొండ)
ఇటుక బట్టీలు ఏర్పాటు చేసే స్థలానికి విధిగా నాలా అనుమతులు తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటాం. చెరువుల నుంచి మైనింగ్ శాఖ అనుమతి లేకుండా మట్టి తరలించకూడదు. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయమని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేస్తాం. తనిఖీల్లో దొరికితే నాలా తీసుకునేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఆ భూమికి రైతు బంధు సాయం నిలిపివేస్తాం.