Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలెండర్ అవిష్కరణలో డబ్బికార్
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రతి ఒక్కరూ రాజకీయ చైతన్యం కలిగి ఉండాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు. ఆదివారం స్థానిక మార్కండేయ ఫంక్షన్ హాల్లో పద్మశాలీల సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రాజకీయం వ్యాపారంగా మారిందని, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఎన్నికల్లో గెలుపొందుతున్నారని, ఆ తర్వాత కోట్ల రూపాయలకు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. ఓటు అంగట్లో సరుకుగా మారిందని ప్రశ్నించేవారు లేకపోవడంతో ప్రజావ్యతిరేక విధానాలలో అవలంబిస్తున్నారన్నారు. ప్రజాధనాన్ని దోచుకు తింటున్నారని విమర్శించారు. పేద ప్రజల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని, ప్రశ్నించే నాయకులను చట్టసభల్లో ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పద్మశాలీలు ఐక్యంగా ఉండి ప్రజల కోసం పనిచేసే వారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయంగా పద్మశాలిలు ఎదగాలన్నారు. అనంతరం పలువురిని సన్మానించారు. లక్కీ కూపన్ ద్వారా గెలుపొందిన పదిమందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు నామిని సోమయ్య, స్టీరింగ్ కమిటీ సభ్యులు భవాండ్ల పాండు, బీఎస్పీ నాయకులు డాక్టర్ రాజు, కౌన్సిలర్ చిలుకూరి రమాదేవి శ్యామ్, మానం శ్రీనివాస్, జిల్లా బిక్షం, అచ్చయ్య, చిలుకూరి బాలు, చేరుపల్లి చంద్రమౌలి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.