Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నాయకులు ఉప్పల కాంతారెడ్డి సోమవారం తెల్లవారుజామున కోదాడలో మృతి చెందారు. వారి మృతికి సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కమిటీ సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయుధ రైతంగ పోరాటం, మునగాల పరిగణతో పాటు కోదాడ, గరిడేపల్లి, నడిగూడెం జమీందారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడంలో కీలక పాత్ర పోషించారని ఆయన సేవలను కొనియాడారు. మునగాల పరిగణలో భూపోరాటాలు చేసి పేదలకు ప్రభుత్వ పోరంబోకు భూములను పంచిన ఘనత ఆయనకే దక్కిందని తెలిపారు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, నాటి ప్రభుత్వాలు పెట్టిన ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని జైలుకు సైతం వెళ్లారని గుర్తు చేశారు. ఎంతోమంది హత్యకు గురైన మొక్కవోని దీక్షతో పార్టీని నడిపించడంలో, క్యాడర్ను తయారు చేయడంలో మంచి కషి ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం అనంతరం ఆయన సీపీఐ(ఎం) వైపు నిలబడి కోదాడ నియోజకవర్గంతో పాటు నాటి హుజూర్నగర్ నియోజకవర్గంలో కూడా పార్టీని పునర్నింర్మించడంలో అరిబండి లక్ష్మీనారాయణ, మేదరమెట్ల సీతారామయ్యతో పాటు ఇంకా అనేకమంది నాయకులతో పని చేశారని పేర్కొన్నారు.
ఆయన ఇల్లే ఒక పోరాట కేంద్రంగా ఉండేదని, విజయవాడ నుండి హైదరాబాద్కు వెళ్లే పార్టీ రాష్ట్ర నాయకులు అక్కడ ఆగి ఉద్యమ వివరాలను తెలుసుకొని అనేక అనుభవాలను, గుణపాటాలను నేర్చుకున్నారని గుర్తు చేశారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత సుందరయ్య, మోటూరు, ఎల్పీజీ, నండూరి ప్రసాదరావు మొదలగు నాయకుల స్ఫూర్తి వారి మీద పడిందన్నారు. ఉమ్మడి జిల్లా సాయుధ పోరాట యోధులు, పార్టీ నాయకులు మల్లు వెంకట్ నరసింహరెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి, పైన పై నాయకులే కాకుండా అనేకమంది స్ఫూర్తితో మునగాల పరిగణలో ఒక వినూతనమైన ఉద్యమాలను నిర్మించిన మహా నాయకుడని తెలిపారు. ఈ ప్రాంతంలో కొత్తగా వచ్చే వారికి ఒక స్ఫూర్తిదాతగా నిలిచారని గుర్తు చేశారు. సీపీఐ(ఎం) సభ్యుల నుండి జిల్లా కమిటీ సభ్యుడి వరకు 2001 వరకు పని చేశారని చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను ముందుకే తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.