Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
పెరిగిన ధరలతో కార్మికుల కుటుంబాలు రోడ్డుపడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మిషన్ భగీరథ కాంటాక్ట్ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి వీరారెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలకుపైగా మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, పెరిగిన నిత్యవసరాల ధరలతో కార్మికుల కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవీపీ, రాఘవ, మణికంఠ సంస్థలు గత నాలుగు నెలలుగా కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపించారు. కార్మికులను రెగ్యులర్ చేయాలని, కనీస వేతనాలు 26 వేలు చెల్లిస్తూ, పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొబైల్, పెట్రోల్ అలవెన్సెస్, వ్యక్తిగత ఇన్సూరెన్స్, హెల్త్ కార్డు మంజురు చేయాలని, చనిపోయిన కార్మికుల కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని, అర్హులైన వారికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కార్మిక సమస్యలను పరిష్కరించాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జంజరాల శ్రీనివాస్, నేలపట్ల అశోక్, కర్నాటి వెంకన్న, గుర్రం వెంకటేశం, ఉయ్యాల ఆంజనేయులు, బ్రహ్మచారి, వేముల సైదులు, సింగం రమేష్, ఏర్పుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.