Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
నల్లగొండ జిల్లాలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్, పార్ట్ టైం, ఫుల్ టైం వర్కర్లకు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి డీటీడీవో ద్వారానే నేరుగా వేతనాలు, పెండింగ్ వేతనాలు చెల్లించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఆశ్రమ పాఠశాలల, గిరిజన హాస్టల్ డైలీవేజ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా అదరపు కలెక్టర్ భాస్కర్‌రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సుమారు 200 మంది డైలీ వర్కర్లు 14 గంటలు కష్టపడి పనిచేస్తున్నారన్నారు. మెజార్టీ కార్మికులు గిరిజన, దళితులు వీరి పట్ల అధికారులు కనీసం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారనీ ఆవేదన చెందారు. జిల్లాలో గత ఏడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వీరికి ఇచ్చే వేతనాలు తక్కువగా ఉంటే అవి కూడా ఏడు నెలల వరకు ఇవ్వకుంటే కార్మికులు ఏం తిని బతకాలని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం డీటీడీవోల ద్వారా వేతనాలు చెల్లిస్తుంటే నల్లగొండ జిల్లాలో మాత్రం వార్డెన్లకు, హెడ్ మాస్టర్లకు అధికారం ఇచ్చి వేతనాలు సకాలంలో ఇవ్వకుండా కార్మికులను వేధిస్తున్నారని విమర్శించారు. నెలకు 30 రోజులు పని చేస్తున్న వీరికి కొంతమంది 26 రోజులకే వేతనాలు చెల్లిస్తూ కార్మికులను శ్రమదోపిడి చేస్తున్నారని తెలిపారు. సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్, యూనియన్ నాయకులు సంగ్య నాయక్, రమేష్ నాయక్, శంకర్‌నాయక్, చీనా నాయక్, పద్మ, మరియమ్మ, దేవా నాయక్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.