Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సంఘాల నేతలు డిమాండ్
నవతెలంగాణ-నల్లగొండ
కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం గ్రామానికి చెందిన బాలిక విషయంలో ఎస్సై వ్యవహరించిన తీరు అనుమానస్పదంగా ఉందని, నిందితులను వదిలివేయడం వలన తిరిగి మళ్ళీ అమ్మాయిని కిడ్నాప్ చేశారని, ఇంతటి నిర్లక్ష్యం వహించిన కట్టంగూరు ఎస్సై విజరు కుమారును వెంటనే సస్పెండ్ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో బాధిత కుటుంబం ప్రజాసంఘాలతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బాలిక(15) 9వ తరగతి చదువుతున్నదనీ ఒంటరిగా ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన యాకాల శ్రీకాంత్ మాయ మాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లి అత్యాచారం జరిపి సూరత్‌కు అమ్మాయిని తీసుకెళ్లగా అతనిపై కేసు నమోదు జరిగిందన్నారు. పోలీసులు నిందితుడిని విచారణ చేస్తున్న క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు ఇతర కారణాల చేత ఎస్సై విజయకుమార్ నిందితుడిని వదిలేశాడన్నారు. ఫోక్సో చట్టం, అత్యాచార చట్టం నమోదు చేసి బాధిత బాలికను ఆస్పత్రిలో టెస్ట్ జరిపి జడ్జి ముందు వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇంత సీరియస్ కేసు విషయంలో నిందితుడిని రిమాండ్ చేయకుండా వదిలివేయడం వల్ల, ఎస్సై నిర్లక్ష్యం వహించడంతో తిరిగి గత నెల 30 న బాలికను మళ్లీ కిడ్నాప్ చేసి ఇప్పటికీ ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ విధంగా వ్యవహరించడం వలన కట్టంగూరు మండలంలోని ప్రజలకు రక్షణ లేదని భరోసా లేదని నిందితులకు కొమ్ముగాసే ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరిని కోరామని తెలిపారు. గతంలో కూడా సదరు ఎస్సైపైన చట్టపరిధికి లోబడి పని చేయడం లేదని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారితో నిర్లక్ష్య సమాధానం చెబుతాడనే అనేక ఆరోపణలు ఉన్నట్టుగా తమ దష్టికి వచ్చిందని తెలిపారు. నేటికీ స్పందన లేదని అమ్మాయి ఆచూకీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి పైన తక్షణమే చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ముందు బాధితులతో కలిపి ధర్నా నిర్వహించనున్నట్టు ప్రజాసంఘాల నేతలు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షుడు పందుల సైదులుగౌడ్, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి మాచర్ల సైదులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షుడు మానుపాటి బిక్షమయ్య, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్, దుగ్గినెల్లి గ్రామ ఉపసర్పంచ్ ఊట్కూరు యాదగిరి, ఎస్ఎంసీ చైర్మెన్ వనం రాంబాబు, చెరువుగట్టు దేవస్థానం కమిటీ మెంబర్ బండమీది లింగస్వామి, మన్నెం సునీత, మన్యం శిరీష, వార్డు మెంబర్ సురిగి మాధవ్, నాగరాజు, కోటేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.