Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
బాల కార్మికుల చట్టం 1986 ప్రకారం ఇటుక బట్టీలలో 18 ఏండ్లలోపు బాల కార్మికులను పనిలో నియమించవద్దని జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా ఇటుక బట్టీల యజమానులకు సూచించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తన ఛాంబర్లో అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం పై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బట్టీల యజమానులు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇటుక బట్టీలలో పని చేసే అంతర్ రాష్ట్ర వలస కార్మికుల కుటుంబాలలో గర్భిణీ స్త్రీలకు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు పోషకాహారం, బట్టీలకు దగ్గర వున్న అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించాలని మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. నల్లగొండ పట్టణం చర్ల పల్లి , జి.కె.అన్నారం లలో ఇటుక బట్టీలలో ఒక్కొక్క చోట 15 మంది పని చేస్తున్నారని, బట్టీల యజమానులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా రెండు రోజులలో అర్హులైన గర్భిణీ, బాలింతలకు, పిల్లలకు పోషకాహారం పంపిణీ చేసి రిపోర్ట్ చేయాలని ఆమె స్త్రీ,శిశు సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ఇటుక బట్టీలలో పని చేసే వలస కార్మికుల జాబితా సేకరించి 15 రోజులలో సమర్పించాలని ఉప కమిషనర్ కార్మికశాఖను ఆదేశించారు. వలస కార్మికులకు సంబంధించి వివిధ సౌకర్యాలు, చర్యలను సంబంధిత అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. అంతర్ రాష్ట్ర వలస కార్మిక కుటుంబాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు అర్హులైన జాబితా 15 రోజులలో సమర్పించాలని పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. ఆ జాబితా కమిషనర్ పౌర సరఫరాల శాఖ కు రేషన్ మంజూరుకు పంపించ నున్నట్లు తెలిపారు. ఈ సమావేశం లో కార్మిక శాఖ ఉప కమిషనర్ రాజేంద్రప్రసాద్, బాలల సంరక్షణ అధికారి గణేష్, మిషన్ భగీరథ ఈ ఈ ముజీబుద్దిన్,డిపిఓ విష్ణు వర్ధన్,లీడ్ మేనేజర్ శ్రామిక్, డీపీఆర్ఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నాన్ మస్టర్ రోల్ వర్కర్ల వేతనాల నిర్ణయంపై సమావేశం
నాన్ మస్టర్ రోల్ వర్కర్ల వేతనాలు 2022 ఏప్రిల్ నుండి 2024 మార్చి వరకు నిర్ణయించేందుకు అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా కార్మికశాఖ, వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తన ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలలో పని చేస్తున్న మస్టర్ రోల్ వర్కర్లు నైపుణ్య, అర్థ నైపుణ్య, నైపుణ్యం లేని,పార్ట్ టైం వర్కర్ ల వేతనాలు నిర్ణయం చేసేందుకు కార్మిక శాఖ,పంచాయతీ రాజ్, ఎస్.సి అభివృద్ది శాఖ,బి. సి.సంక్షేమ శాఖ, గృహ నిర్మాణ శాఖ ,వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం చర్చించి వేతనం నిర్ణయంపై అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్మికశాఖ ఉప కమిషనర్ రాజేంద్రప్రసాద్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్, వ్యవసాయ శాఖ ఏడి హుస్సేన్ బాబు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి సల్మా భాను, బిసి సంక్షేమ శాఖ అధికారిణి పుష్పలత తదితరులు పాల్గొన్నారు.