Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఇటుక బట్టీల వద్ద పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను పాఠశాలలకు పంపే బాధ్యత ఇటుక బట్టీల యజమానులు వహించాలని, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు రామచంద్రయ్య, వంగూరు వీరయ్య పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గూడూరు, కొత్తగూడెం గ్రామాల వద్ద ఇటుక బటీలలో పనిచేస్తున్న ఒరిస్సా వలస కార్మికుల పిల్లలను కలిసి వారందరూ భట్టీల వద్దనే చదువుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఒరిస్సా నుండి వచ్చిన విద్యావంతున్ని వాలంటీర్‌గా నియమించి మధ్యాహ్న భోజనం, పుస్తకాలు, ప్రభుత్వం ద్వారా అందించే ఏర్పాటు చేశారు. బడిబైటి పిల్లల సర్వేలో భాగంగా బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వారందరూ పాఠశాలల్లో వయసుల వారీగా తరగతులు కేటాయించి వారి వారి భాషల్లోనే విద్యను అందించే బాధ్యత ఇటుక బట్టి పరిశ్రమ యజమానులు తీసుకోవాలని సూచించారు. వారి వెంట మండల విద్యాధికారి ఎం. బాలాజీనాయక్, సీఆర్పీ శ్రీనివాసచారి, ఇటుక బట్టీల యజమానులు రమణయ్య, మోహన్ రావు తదితరులున్నారు.