Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంపెనీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్
- రంగారెడ్డి జిల్లాలో కంపెనీకి చింతపల్లి మండలం నుంచి రహదారి ఎలా..?
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య
నవతెలంగాణ-చింతపల్లి
రైతుల భూముల నుంచి ఐఎంఆర్ ఆగ్రోవిట్ కంపెనీకి అక్రమ దారికి తహసీల్దార్ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య డిమాండ్ చేశారు.కంపెనీ దారికి రైతులు కోల్పోయిన భూమికి నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలన్నారు.మంగళవారం చింతపల్లి మండలంలోని పోలేపల్లి గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 240,224 మధ్య భూముల నందు రైతులు పలకంటి నారయ్య,పడకంటి కృష్ణయ్య, పలకంటి బక్కయ్య,పలకంటి వీరమ్మ,పడకంటి కృష్ణయ్య, పడకంటి యాదయ్య మొదలైన రైతుల భూములను సందర్శించారు.అనంతరం మాట్లాడుతూ రైతుల పట్టా భూముల నుండి ఐఎమ్ఆర్ కంపెనీకి అక్రమ దారికి తహసీల్దార్,ఆర్ఐ, సర్వేయర్లు కంపెనీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్ ( పంచనామా ) వారి దారికి అనుమతి ఇచ్చినట్లు కంపెనీ యాజమాన్యం చెబుతున్నారన్నారు. అట్టి పంచనామాను అడ్డుపెట్టుకొని రైతుల భూముల మధ్యన కంపెనీకి అక్రమంగా రోడ్డును వేస్తున్నారని రైతులు తెలియజేశారని, ఇదివరకే తహసీల్దార్ సర్వే నివేదికలో నెంబర్ 240, 224 మధ్యన నక్ష ప్రకారం ఎలాంటి కాలిబాటగానీ,ఎడ్లబండి బాట గానీ, రహదారి లేదని నివేదికను సమర్పించారని గుర్తు చేశారు.కంపెనీ యాజమాన్యానికి చట్ట విరుద్ధంగా తహసీల్దార్, ఆర్ఐ, సర్వేయర్లు కుమ్మక్కై కంపెనీ యాజమాన్యం చూపిన ప్రలోభాలకు లొంగి రైతుల భూములగుండా దారికి అనుమతులు ఇచ్చి, పోలీసుల చేత అక్రమ కేసులు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుండడం మానుకోవాలని హెచ్చరించారు. రైతులు పేర్కొన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు నిజనిర్దారణ చేసుకుని తప్పుడు సర్వే రిపోర్టుపై స్పందించి, రైతులకు, ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేసి, కంపెనీపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఒకవేళ అనుమతులు ఇచ్చినట్టయితే వెంటనే రద్దుచేయాలని తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. రైతులకు న్యాయం జరగపోతే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తమ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. వృద్ధ రైతులను ఇబ్బంది పెడితే వారికి అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు పడకంటి నారయ్య, పడకంటి బక్కయ్య, పడకంటి వీరమ్మ, పడకంటి యాదయ్య, పడకంటి కృష్ణయ్య, పడకంటి మాదర్, బహుజన సైన్యం రాష్ట్ర కమిటీ సభ్యులు దున్నబాలకృష్ణ, నితిన్ పాల్గొన్నారు.