Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వర్గ విభేదాలకు... గ్రూపు రాజకీయాలకు కాంగ్రెస్‌కు పెట్టింది పేరు... రాష్ట్ర నాయకత్వంలో గ్రూపు రాజకీయాలు ఉండగా... ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కూడా కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు నడిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు అగ్రనేతలు ఉన్నప్పటికీ వారు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారే రాజకీయాలు చేస్తూ నియోజకవర్గాల పై పట్టు సాధించేందుకు కష్టాలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో గత ఎన్నికల్లో చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. గెలిచిన వెంటనే అభివద్ధి పేరిట చిరుమర్తి లింగయ్య అధికార బీీిఆర్ఎస్ గూటిలో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం అధికార పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విఫలం చెందారు. చివరికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి బీజేపీి తరఫున పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా లోని 12 నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కొనసాగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడంతో వారి సహకారంతో గులాబీకి కంచుకోటగా మారిన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పూర్వ వైభోగం తెచ్చుకునేందుకు నేతలు అష్ట కష్టాలు పడుతున్నారు. వారిలో ఐక్యత లేకపోవడం కారణంగా జిల్లాలో కనీసం తమ ఉనుకిని కాపాడుకునే పరిస్థితి కనిపించడం లేదు.
- కాంగ్రెస్ లో పెరుగుతున్న పోటీ
- గ్రూపులుగా విడిపోయిన నాయకులు
- పార్టీ కార్యక్రమాలకే పరిమితమైన నేతలు
- అగ్ర నేతల మద్దతు కలిసొచ్చేనా
- అయోమయంలో కాంగ్రెస్ శ్రేణులు
నవతెలంగాణ- మిర్యాలగూడ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు అగ్ర నేతలు చలామణి అవుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కుందూరు జానారెడ్డి, నల్గొండ భువనగిరి ఎంపీలు ఎన్.ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దామోదర్ రెడ్డిలు ఎవరికి వారే గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. గతం నుంచి నేటి వరకు ఒక్కొక్కరు రెండు నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తూ తమ అనుమాయకులకే ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకుంటున్నారు. అదనంగా మరో నియోజకవర్గంపై దష్టి పెట్టి తమ అనుచరణనాన్ని పోషిస్తూ రాజకీయాలు చేస్తున్నారు. కుందూరు జానారెడ్డి సొంత నియోజకవర్గమైన నాగార్జునసాగర్ తో పాటు మిర్యాలగూడ దేవరకొండ, ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్, కోదాడ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ, నకిరేకల్, మునుగోడు, దామోదర్ రెడ్డి సూర్యాపేట తుంగతుర్తి నియోజవర్గాలలో పెద్దదిక్కుగా ఉంటూ పార్టీని నడిపిస్తున్నారు.
కనిపించని ఐక్యత....
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు సంస్థాగతంగా మంచి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత లేకపోవడం కారణంగా గత రెండు ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వారిలో ఐక్యత లేకపోవడంతో మరో మారు పరాభవం ఎదుర్కోవాల్సి వస్తుందని జిల్లా ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆ నలుగురు నేతల నియోజకవర్గాలలో మరొకరు జోక్యం చేసుకోకూడదని బలమైన ఒప్పందం ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్న ఇద్దరు ఎంపీలు తమ వర్గాలను ఏర్పాటు చేసుకోవడంతో బడా నాయకుల్లో అసంతృప్తి నెలకొని గ్రూపులుగా విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆయా నియోజవర్గాలలో పార్టీ నాయకులు కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. బడా నేతల ఆశీస్సులు తమకే ఉన్నాయని వచ్చే ఎన్నికల్లో టికెట్టు తమకే వస్తుందని ఆశతో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం లోను కూడా గ్రూపులుగా విడిపోయి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో వర్గ పోరు తీవ్రతరమైంది. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి గ్రూపు పోరు.. గ్రూపు రాజకీయాల్లో తలనొప్పిగా మారింది
టికెట్ కోసం పోడిపడుతున్న ఆశావాహులు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అన్ని నియోజకవర్గాలలో ఆశావాహులు పోటీ పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అంతేకాకుండా అధికార పార్టీ నుండి టికెట్ రాని పక్షంలో కాంగ్రెస్ టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాల్లో నేతలు ఉన్నారు. నల్గొండ నియోజకవర్గం నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ముందే ప్రకటించడంతో అక్కడ దుబ్బాక నరసింహారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుండి డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్, ప్రోత్నాథ్ ప్రమోద్ కుమార్, తంగిళ్ల రవికుమార్, ఆలేరు నుంచి బీర్ల ఐలయ్య, అయోధ్య రెడ్డి, దేవరకొండ నుండి మాజీ ఎమ్మెల్యే బాలు నాయక్, కిషన్ నాయక్, జగన్ లాల్, బిల్యా నాయక్, వర్త్య రమేష్ నాయక్, నకిరేకల్ నుండి దైద రవీందర్, కొండేటి మల్లయ్య, సూర్యాపేట నుండి దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి, తుంగతుర్తి నుండి అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి, మునుగోడు నుండి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, వున్న కైలాస్ నేత, మిర్యాలగూడ నుండి కుందూరు జానారెడ్డి, రఘువీరా రెడ్డి, అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, ఇరుగు మధు, నాగార్జునసాగర్ నుండి కుందూరు జానారెడ్డి లేకపోతే అతని కుమారులు జయ వీర్ రెడ్డి, రఘువీరారెడ్డి, కోదాడ నుంచి పద్మావతి, పందిరి నాగిరెడ్డి, హుజూర్నగర్ నుండి నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
నాలుగు తప్ప... మిగిలిన చోట పోటీ
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు నియోజవర్గాలు తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో టికెట్ కోసం ఆశవాహులు పెద్ద ఎత్తున పోటీపడుతున్నారు. ఆయా నియోజకవర్గాలలో వర్గాలుగా విడిపోయి ఇప్పటినుండే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మిర్యాలగూడ నియోజవర్గంలో బత్తుల లక్ష్మారెడ్డి ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి సహకారంతో టికెట్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, శంకర్ నాయక్‌లు జానారెడ్డి మద్దతుతో టికెట్ దక్కించుకోవాలని చూస్తున్నారు. భువనగిరిలో ముగ్గురు కూడా తీవ్ర పోటీ పడుతున్నారు. ఇందులో తంగిళ్ళ రవికుమార్ రేవంత్ రెడ్డి వర్గం కాగా ప్రమోద్ కుమార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో, అనిల్ కుమార్ జానా రెడ్డి మద్దతుతో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దేవరకొండలో బాలు నాయక్ కు జిల్లా అగ్ర నేతల మద్దతు ఉండగా, బిల్యా నాయక్‌కు రేవంత్ రెడ్డి మద్దతుతో ఉన్నారు. మిగిలిన కిషన్ నాయక్, జగన్‌లాల్, రమేష్ నాయక్ లు సైతం బడా నేతల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నారు. నకిరేకల్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో దైద రవీందర్ జానారెడ్డి సహకారంతో కొండేటి మల్లయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంకు బీఆర్ఎస్ టికెట్ రాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డితో వేముల వీరేశంకు మంచి సంబంధాలు ఉన్నాయని ప్రచారం కూడా నడుస్తుంది. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎలాగైనా పోటీ చేస్తారని ప్రచారం నడుస్తున్న రేవంత్ రెడ్డి సహకారంతో పటేల్ రమేష్ రెడ్డి కూడా టికెట్ దక్కించుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. తుంగతుర్తిలో రేవంత్ రెడ్డి సహకారంతో అద్దంకి దయాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో వడ్డేపల్లి రవి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మునుగోడులో గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పాల్వయ స్రవంతి, ఉన్నాం కైలాస్ నేత ఒకటైనట్టు ప్రచారం నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఆశీస్సులతో చలమల కృష్ణారెడ్డికి టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. కోదాడలో పద్మావతి కు దాదాపు టికెట్ ఖాయమని ప్రజల్లో చర్చ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన సామాజిక వేత్త పందిరి నాగిరెడ్డి బలంగా టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. చాప కింద నీరులా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో వెళుతున్నట్లు నిఘవర్గాలు చెప్తున్నాయి. మిగిలిన హుజూర్నగర్ నల్గొండ, నాగార్జునసాగర్ బడా నాయకులే ఉండడంవల్ల ఈ నియోజకవర్గాల్లో పోటీ కనిపించడం లేదు.
బరిలో నిలిచేదేవరో...
ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఎనిమిది నియోజకవర్గాలలో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావాహుల పోటీ పెరుగుతుండడంతో రానున్న ఎన్నికల్లో ఎవరికి టికెట్ దక్కుతుందోనని ప్రజల జోరుగా చర్చ జరుగుతుంది. ఏ వర్గం వారికి టికెట్ ఇప్పించుకుంటారో... ఎవరైతే గెలుస్తారో చర్చ కూడా జోరుగా నడుస్తోంది. బడా నేతల ఆశీస్సులు ఎవరికి ఎక్కువగా ఉంటుంది... ఎవరు బరిలో నిరుస్తారో .. టికెట్టు దక్కని పక్షంలో ఏ నియోజకవర్గం నుండి ఎవరు పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారో.. అన్న చర్చ కూడా నడుస్తోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో... ఎవరికి అదృష్టం కలిసి వస్తోదో అని ప్రజల్లో చర్చ నడుస్తుంది.