Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మా నిధులు మాకు ఇవ్వాలని సభలో బైటాయించి నినాదాలు చేసిన ఎంపీటీసీిలు
- మెజార్టీ మేరకే నిధులు కేటాయించుకుంటే ప్రతిపక్షం ఎంపీటీసీల పరిస్థితి ఏంటి..?
- స్థానిక ఎమ్మెల్యే ఇలాంటి వాటిని ప్రోత్సహించడం శోచనీయం : సీపీఐ (ఎం) ఎంపీటీసీలు
నవతెలంగాణ -రామన్నపేట
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన మాకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సర్వసభ్య సమావేశాన్ని సీపీిఐ(ఎం) ఎంపీటీసీలు స్థానిక ఎంపీపీ, ఎంపీడీవో తీరుకు నిరసనగా నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేశారు. సర్వసభ్య సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగా సీపీఐ (ఎం) ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బడుగు రమేష్, వెల్లంకి ఎంపీటీసీ ఎర్రోళ్ల లక్ష్మమ్మ 'మా నిధులు మీ ఇష్టాసారంగా ఎనిమిది మంది ఎంపీటీసీలకే ఎలా కేటాయించుకుంటారని, మాకు నిధులు ఇస్తామని సభాముఖంగా హామీ ఇవ్వాలి'అని ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సభలో పోడియం ఎదుట బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీటీసీ వేమవరం సుదీర్ బాబు, బీఆర్ఎస్ ఎంపీటీసీలు ఎండి.రెహన్, మాడురి జ్యోతి, పూస బాలమణిలు సీపీిఐ (ఎం)ఎంపీటీసీలకు మద్దతిచ్చారు. ఈ సందర్భంగా అధికార పక్ష, ప్రతిపక్ష ఎంపీటీసీలకు వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో సభ ఆసాంతం రసాభాసగా మారింది. ప్రతిపక్ష పార్టీల ఎంపీటీసీలకు కూడా రావాల్సిన నిధులను ఇవ్వాలని సీపీిఐ(ఎం)ఎంపీటీసీలు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రతిపక్ష ఎంపీటీసీలను అగౌరపర్చే విధానాన్ని ప్రోత్సహించడం సరికాదని వారు ఈ సందర్భంగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి కక్ష సాధింపు చర్యలు చేయడం సరికాదని, సీపీిఐ (ఎం) ఎంపీటీసీల సహకారంతో ఎంపీపీ పదవి పొంది ఈరోజు విశ్వాసాన్ని మరచి వ్యవహరిస్తున్నారని, తమ నిధులు తమకు ఇస్తామని హామీ ఇచ్చేంతవరకు సభను జరగనివ్వమని వైస్ ఎంపీపీ ఉపేందర్, ఎంపీటీసీలు బడుగు రమేష్, ఎర్రోళ్ల లక్ష్మమ్మ, జ్యోతి, సుధీర్ బాబు తేల్చి చెప్పారు. ఎంపీపీ జ్యోతి సభను సాగనివ్వాలని ఎజెండా అంశాలు చర్చించాలని ఎంపీటీసీలను కోరినా ఫలితం లేకుండా ఆందోళన కొనసాగిస్తుండడంతో చేసేదేమీలేక ఎంపీపీ సభను ఇంతటితో ముగిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో ఎలాంటి ఎజెండా అంశాలు చర్చించకుండానే సభ ముగిసింది.
అయోమయానికి గురైన అధికారులు
'మా నిధులు మాకు' ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎంపీటీసీలు మండల సర్వసభ్య సమావేశంలో ఆందోళన నిర్వహిస్తున్న సందర్భంలో ఎజెండ అంశాల మేరకు అధికారులను తమ నివేదికలను చదివి వినిపించాలని ఎంపీపీ జ్యోతి సూచించగా, తాము ఆందోళన చేస్తుంటే ఎట్లా మాట్లాడతారని ఎంపీటీసీలు అధికారులను అడ్డుకున్నారు. ఇలా పలుమార్లు జరగడంతో అధికారులు మాట్లాడాలో వద్దో తెలియక అయోమయానికి గురవుతూ తెల్ల ముఖమేసి నిలుచుండిపోయారు. కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాము కోపం లా తయారయింది అధికారుల పరిస్థితి.