Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్లుగీత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సూర్యాపేట
స్వచ్ఛమైన ప్రకృతి పానీయం నీరాకు వేదామృతం పేరు పెడితే వేదాలను కించపరిచినట్టు ఎలా అవుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.మంగళవారం స్థానిక ఎంవీఎన్ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు.ప్రకృతిసిద్ధంగా తాటి,ఈత చెట్ల నుండి సూర్యరశ్మి రాకముందే తీసే స్వచ్ఛమైన పానీయం నీరా అన్నారు.దీనిని బాటిల్స్‌లో, ప్యాకెట్లలో నింపి వినియోగదారులకు అందజేస్తారని చెప్పారు.ఈ నీరాకు ప్రభుత్వం వేదామృతం అనే పేరు పెట్టిందన్నారు.బ్రాహ్మణసంఘాలు ఈ పేరు తొలగించాలనడం అవివేకమన్నారు.దీనివలన వారికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు.పురాణాలలో సురులు సేవించిన పానీయం కాబట్టి సురాపానకం అన్నారని తెలిపారు.వేదాలను రచించింది తాటి కమ్మల మీదనే నని చరిత్రను మనకు తెలియజేసిందని వివరించారు.చెట్లనుండి వచ్చే పానీయానికి వేదామృతం అని పెడితే తప్పేమిటని పేర్కొన్నారు.దేవుళ్ళ పేరుతో లిక్కర్ షాపులు ఉన్నాయని, వాటిలో శ్రీ వెంకటేశ్వర బార్, సాయి బార్, శ్రీరామబార్ అని పేర్లు పెట్టుకుంటారని, వాటికి పూజలు చేసేది కూడా బ్రాహ్మణులేనన్నారు.వాటి మీద లేని అభ్యంతరం నీరాపై ఎందుకని ప్రశ్నించారు.ప్రతిదానిని రాద్ధాంతం చేయడం వీరికి పరిపాటిగా మారిందన్నారు.ఇలాంటి తలతిక్క మాటలు మాట్లాడితే గీత కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్గూరి గోవింద్, రాష్ట్ర కమిటీ సభ్యులు మడ్డి అంజిబాబు, గుణగంటి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ ఇస్తారు, నోముల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.