Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 41 మంది విద్యార్థులకు స్కాలర్‌షిఫ్‌లు పంపిణీ
నవతెలంగాణ-చౌటుప్పల్
విద్యాభివృద్ధికి దివీస్ పరిశ్రమ అందిస్తున్న కృషి ఎంతో అభినందనీయమని మండల పరిధిలోని పంతంగి, దేవాలమ్మనాగారం గ్రామాల సర్పంచ్‌లు బాతరాజు సత్యం, కల్లెం శ్రీనివాస్‌రెడ్డిలు అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ పరిధిలోని దివీస్ లాబోరేటరీస్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో 41 మంది పేద మెరిట్ విద్యార్థులకు 6 లక్షల 44వేల రూపాయల స్కాలర్‌షిప్పులను ఆ పరిశ్రమ డిప్యూటీ జనరల్ మేనేజర్ బాలకిశోర్తో కలిసి వారు పంపిణీచేశారు. ఈ సందర్భంగా పంతంగి సర్పంచ్ బాతరాజు సత్యం మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దివీస్ పరిశ్రమ ఎంతో తోడ్పాటునందిస్తుందన్నారు. విద్యార్థులు, పాఠశాలలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పాటునందించాలనే ఉద్దేశంతోనే మెరిట్, పేద విద్యార్థులకు చాలా సంవత్సరాల నుండి స్కాలర్షిప్పులు అందజేయడం సంతోషకరమన్నారు. దివీస్ వారు పరిసర గ్రామాల అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. దేవాలమ్మ నాగారం గ్రామ సర్పంచ్ కల్లెం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. దివీస్ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాలకు వరం అని కొనియాడారు. దివీస్ జీఎం బాలకిశోర్ మాట్లాడారు. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. దివీస్ వారు అందిస్తున్న స్కాలర్‌షిప్పులను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని పరిశ్రమ, తల్లిదండ్రులు, గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దివీస్ అధికారులు సీహెచ్.వీరయ్య, సాంబశివరావు, కె.శివప్రసాద్, బికెకె.చౌదరి, సీఎస్ఆర్ ఇన్ఛార్జీ వల్లూరి వెంకటరాజు, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.