Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 లక్షల 65 వేల రికవరీకి 122మంది మెట్ల తొలగింపు
- టీఎలకు కార్యదర్శులకు 20వేల పెనాల్టీ
నవతెలంగాణ-పెన్పహాడ్
మండలంలోని 29 గ్రామాల్లో నవంబర్ 2019 నుండి మార్చి 2022 వరకు నిర్వహించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పధకంలో గుర్తించిన 2051 పనులకు గాను 18 కోట్ల 80 లక్షల 64 వేల 452 రూపాయల నిధులు మంజూరు కాగా 11లక్షల 65 వేల అవినీతి జరిగిందని ఈ సొమ్మును రికవరీ చెయ్యాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించినట్లు డీఆర్డ్డీఏ ఏపీడి పెంటయ్య శుక్రవారం తెలిపారు. ఈనెల 2 నుండి 11 వరకు గ్రామాల్లో సామాజిక తనిఖీ బదం తనిఖీలు నిర్వహించి గురువారం రాత్రి 2 గంటల వరకు ఇంచార్జి ఎంపీడీవో బాణాల శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన 13వ విడత మండల సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 కోట్ల 34 లక్షల 64 వేల 676 రూపాయలు కూలీల వేతనాల చెల్లింపు, 3 కోట్ల 62 లక్షల 92 వేల 865 రూపాయలు మెటీరియల్ చెల్లింపులు జరిగాయని అన్నారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ రికార్డుల పర్యవేక్షణ, జాబ్ కార్డుల నవీకరణ, సెగ్రిగేషన్ షేడ్స్ ల్లో ఫోటో మ్యాపింగ్ సరిగా లేకపోవడంతో ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులకు 20 వేల పెనాల్టీ విధించడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులకు రానివారికి మస్టర్లు వేయడం లాంటి కారణాలతో మండలంలోని అన్ని గ్రామాల్లో 122 మంది మెట్లను తొలగించినట్లు వెల్లడించారు. రంగయ్య గూడెం గ్రామంలో 15 మంది మెట్లకు గాను అందరిని తొలగించి నూతన మెట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని కూలీలను కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, పిఏసీఎస్ చైర్మెన్లు వెన్న సీతారాంరెడ్డి, నాతాల జానకిరాంరెడ్డి, అమ్బుడ్సమెన్ లచ్చిరాంనాయక్, విజిలెన్స్ అధికారి ఆశారాణి, హెచ్అర్సీలు రమేష్, గంగరాజు, ఇంచార్జి ఎంపీడీవో బాణాల శ్రీనివాసు, ఎంపీవో నరేష్, ఏపీవో రవి, ఈసీ ఏకస్వామి, పంచాయితీ కార్యదర్శులు, టీయేలు, పిల్డ్అసిస్టెంట్, కూలీలు తదితరులు పాల్గొన్నారు.