Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం
నవతెలంగాణ-మర్రిగూడ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. సోమవారం మర్రిగూడ మండలంలోని కొండూరు గ్రామంలో ప్రజాసంఘాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర చట్టం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని, ఏకకాలంలో రుణమాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు. రైతులకు వడ్డీ భారాన్ని తగ్గించి రైతు ఆత్మహత్యల నివారణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న రైతుబంధు మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలని తెలిపారు. పత్తి ధరను క్వింటాకు పదివేల రూపాయల చొప్పున చెల్లించాలని, ధరణి సమస్యలు పరిష్కరించాలని, 57 సంవత్సరాల నిండిన రైతుకు పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. చర్లగూడెం భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి, ముంపు గ్రామాలకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కొట్టం యాదయ్య, ఉప్పునూతల వెంకటయ్య, మోకురోజు బిక్షపమ్మ, శీను, శేఖర్, గడగోటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.